తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పులివెందుల పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించినట్టుగా తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పులివెందుల పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. బుధవారం రోజున పులివెందులలో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. అయితే చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదని పోలీలీసులు చెబుతున్నారు. దీంతో పోలీసుల తీరుపై బీటెక్ రవితో పాటు పలువురు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో చంద్రబాబు పులివెందులలో పర్యటిస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఇక, ఏపీలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ‘పెన్నా నుంచి వంశధార వరకు’ ప్రాజెక్టుల పరిశీలన చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా రాయలసీమలో ప్రాజెక్టుల పరిశీలనకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను ఖరారు చేశారు. ఆగస్టు 1న చంద్రబాబు నాయుడు నందికొట్కూరులో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. ముచ్చుమర్రి ప్రాజెక్టు, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌ను సందర్శించనున్నారు.
ఆగస్టు 2న చంద్రబాబు కొండాపురం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అదే రోజున పులివెందులలో చంద్రబాబు రోడ్ షో, పూల అంగళ్ల సర్కిల్ లో సభ నిర్వహించనున్నారు. ఆగస్టు 3న రాప్తాడు నియోజకవర్గంలోని పేరూరు ఎత్తిపోతలను సందర్శించనున్నారు. అదే రోజు గొల్లపల్లి రిజర్వాయర్ వద్దకు వెళ్తారు. అనంతరం పెనుగొండ నియోజకవర్ం పరిధిలోని కియా కార్ల పరిశ్రమను సందర్శించనున్నారు. ఆగస్టు 4న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు బ్రాంచ్ కెనాల్ ను పరిశీలించనున్నారు. అదే రోజున పూతలపట్టులో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక, మిగిలిన జిల్లాలలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది.
