అమరావతిలో మహిళా పేకాట క్లబ్బా ?

First Published 21, Dec 2017, 8:27 AM IST
Police conduct raids on women club
Highlights
  • మహిళలకు మాత్రమే అనుమతి. ఇదేదో మహిళా కళాశాలో లేకపోతే మహిళలు మాత్రమే పనిచేసే కార్యాలయమో అనుకుంటున్నారా?

మహిళలకు మాత్రమే అనుమతి. ఇదేదో మహిళా కళాశాలో లేకపోతే మహిళలు మాత్రమే పనిచేసే కార్యాలయమో అనుకుంటున్నారా? కాదులేండి. పూర్తిగా ఆడవాళ్ళే నిర్వహిస్తూ, ఆడవాళ్ళు మాత్రమే ఆడుకునే క్లబ్బు లేండి. అదికూడా అలాంటిలాంటి క్లబ్బు కాదు. పేకాట క్లబ్బు. రాష్ట్రంలో పేకాట క్లబ్బులు దాదాపు లేవనే చెప్పాలి. ఎక్కడైనా హోటళ్ళల్లోను లేకపోతే ఏదైనా ఫాం హౌస్సులోనే ఆడుకోవటం మాత్రమే సాధ్యం. అదికూడా పోలీసులకు ఎక్కడ దొరికిపోతామో అని బిక్కుబిక్కుమంటూ ఆడుతుంటారు.

అలాంటిది ఏకంగా రాజధాని ప్రాంతంలోనే అందులోనూ మహిళలే ఓ పేకాట క్లబ్బును నడుపుతున్నారంటే మాటలా? వారి వెనుక ఏ స్ధాయిలో రాజకీయ దన్నులేకపోతే అంత ధైర్యంగా పేకాటక్లబ్బును నడపగలరు? కాకపోతే వారి ఖర్మ కాలి పోలీసులకు దొరికిపోయారంతే.

విజయవాడలోని ఓ బట్టల వ్యాపారి భార్య పాలడుగు రాజేశ్వరి ఈ క్లబ్బును నిర్వహిస్తున్నారట. ముందుజాగ్రత్తగా పోలీసులను, రాజకీయ నేతలను కూడా మచ్చిక చేసుకున్నారట. ఎప్పటి నుండి ఈ క్లబ్బు నడుస్తోందో స్పష్టంగా తెలీదు కానీ సొసైటీలో పెద్ద వాళ్ళుగా చెలామణిలో ఉన్న వాళ్ళ భార్యలే ఇక్కడకు రోజు వస్తుంటారట. ప్రతీరోజూ లక్షల్లో టర్నోవర్ ఉంటుందట.  

మామూలుగా అయితే, ఈ క్లబ్బు ఛాయలకు కూడా పోలీసులు పోరు. అటువంటిది ఏమైందో ఏమో? క్లబ్బుకు వచ్చే వాళ్ళమధ్య ఏదో జరిగుంటుంది. అందుకే విషయం పోలీసుల చెవినపడింది. ఇంకేముంది పోలీసులు నిఘ వేశారు. విషయమంతా కూపీ లాగారు. సమయం చూసుకుని ఒక్కసారిగా అపార్టుమెంటుపై దాడి చేసారు. ఒక్కసారిగా దాడి చేసిన పోలీసులను చూసి నిర్వాహకులతో పాటు పేకాటాడుతున్న వారు కూడా బిత్తరపోయారు. అడ్డంగా దొరికిపోయిన తర్వాత చేసేదేముంది? క్లబ్బును మూయించేసి నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

 

loader