తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు పోలీసు స్టేషన్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది.
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు పోలీసు స్టేషన్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. ఆయనతో పాటు 8 మంది టీడీపీ నేతలు, వెయ్యి మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ భక్తవత్సల ఫిర్యాదుతో కేసు నమోదైంది. శుక్రవారం రోజున చంద్రబాబు నాయుడు అనపర్తి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం బలభద్రపురం నుంచి అనపర్తి వరకు పాదయాత్రగా వెళ్లారు. అనంతరం అనపర్తిలో రోడ్‌లో మాట్లాడారు. అయితే చంద్రబాబు, టీడీపీ నాయకులపై నిబంధనల ఉల్లంఘన, పోలీసులపై దురుసుగా మాట్లాడి, దూషించారని డీఎస్పీ ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు సహా, టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే.. శుక్రవారం చంద్రబాబు నాయుడు అనపర్తి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు రోడ్ షో వేయవచ్చని.. అయితే రోడ్డుపై బహిరంగ సభలు పెట్టవద్దని పోలీసులు టీడీపీ నేతలకు స్పష్టం చేశారు. వీరి ప్రతిపాదనకు అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి నాయుడుతో పాటు ఇతర నాయకులు అంగీకరించలేదు. ఇక, బలభద్రపురం గ్రామం వద్ద అనపర్తికి వెళ్లే దారిని పోలీసులు మూసివేసే ప్రయత్నం చేశారు. పోలీసులు, పార్టీ నేతలతో చర్చలు జరిపిన చంద్రబాబు అనపర్తి పర్యటనకు సిద్ధమయ్యారు. ఇంతలో టీడీపీ క్యాడర్ రోడ్డుపై పోలీసులు ఉంచిన బారికేడ్లను తోసివేయడంతో చంద్రబాబు ముందుకు సాగారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో మహాత్మాగాంధీ దండి మార్చ్ తరహాలోనే తాను కూడా దీన్ని చేస్తానని చెప్పారు. జగ్గంపేట, పెద్దాపురం పోలీసులు తన పర్యటనను అడ్డుకోలేదని.. అయితే అనపర్తి వద్ద స్థానిక ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి ఒత్తిడి కారణంగా పోలీసులు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. బలభద్రపురం నుంచి అనపర్తిలోని దేవీచౌక్ సెంటర్‌కు 6 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లిన చంద్రబాబు.. అక్కడ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. తనపై ఎందుకంత ఆంక్షలని ప్రశ్నించారు. తాను నేను పాకిస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చానా? అంటూ ఫైర్ అయ్యారు.
