కడుపున నవ మాసాలు మోసి.. కంటికి రెప్పలా చూసుకున్న తల్లి ప్రాణాలు కోల్పోతే.. కనీసం ఆ కొడుకు తల కొరివి కూడా పెట్టలేదు. ఈ సంఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. కన్నతల్లికి తలకొరివి  పెట్టకుండా కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన మచిలీపట్నం కోర్టు సమీపంలో చోటు చేసుకుంది.  

రాజారత్నం అనే మహిళ గత రాత్రి బంటుమిల్లులోని కూతురు ఇంటి వద్ద చనిపోయింది. దీంతో మృతదేహాన్ని కుమార్తె, అల్లుడు  కలిసి బందరు తీసుకువచ్చారు. అయితే తాను మృతదేహాన్ని ఖననం చేయనంటూ  కొడుకు నాగ ప్రసాద్ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. 

నాగప్రసాద్ ఏఆర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. తమ అక్క, బావ డబ్బులు కోసం తన తల్లిని చంపారని చిలకపూడి పోలీస్ స్టేషన్‌లో నాగప్రసాద్ ఫిర్యాదు చేశాడు. తలకొరివి పెట్టాల్సిన కొడుకు ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో వెళ్లి పోవడంతో స్థానిక ప్రజలు విస్తుపోయారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ జోక్యం చేసుకోవాలని  బంధువులు కోరుతున్నారు.