సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పై బీజీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతాపార్టీ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ధర్మ పోరాట దీక్ష పేరుతో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ..  మోదీ శిఖండిలా, కొజ్జాలా రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. దీంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యాలపై రాష్ట్ర బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో శనివారం విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్‌ నరసింహన్‌తో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ధర్మ పోరాట దీక్షలో మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే విష్టుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌లు ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ.. రాజ్యాంగం పట్ల గౌరవం లేని వ్యక్తి ప్రజాప్రతినిధిగా కొనసాగే హక్కు లేదని పేర్కొన్నారు. 


అంతేకాకుండా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ట్రాన్స్ జెండర్లను కించపరిచేలా ఉన్నాయంటూ బీజేపీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్ లు ఆరోపించారు.ఇక విజయవాడలో పలువురు బీజేపీ నేతలు బాలకృష్ణ దిష్టి బొమ్మను కూడా దహనం చేశారు. ఇదిలా ఉండగా తిరుపతిలో పలువురు బీజేపీ నేతలు
బాలకృష్ణ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.