నిజానికి అదొక సంతాన సాఫల్య కేంద్రం. బిడ్డలు పుట్టని దంపతులకు ఆశాజనంగా మారాల్సిన ఆ కేంద్రం.. అక్రమాలకు దారితీసింది. పిల్లలు పుట్టడం లేదంటూ.. అక్కడకు వచ్చే దంపతులకు... వేరే బిడ్డలను దత్తత ఇస్తామంటూ ఆశపెడుతున్నారు. ఇక బిడ్డలను పోషించలేని ఒంటరి స్త్రీలకు ఎరవేసి.. వారికి డబ్బు ఆశచూపించి.. పురిట్లోనే బిడ్డలను దూరం చేస్తున్నారు. ఈ దారుణాలు విశాఖ నగరంలో చోటుచేసుకుంటుండగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖ నగరంలోని జిల్లా పరిషత్‌ జంక్షన్‌లో ఉన్న ‘యూనివర్సల్‌ సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చి సెంటర్‌‘ ఆధ్వర్యంలో పసిపిల్లల విక్రయం, అక్రమ రవాణా జరుగుతున్నట్లు జూన్‌ 24న పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఇటీవల ఓ మహిళకు భర్త దూరమయ్యాడు. భర్త చనిపోయిన తర్వాత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతని ద్వారా గర్భం దాల్చింది. అయితే.. ఈ విషయం బయటకు తెలిస్తే.. తన పరువు పోతుందని సదరు మహిళ భావించగా.. ఆమెను ఈ సంతాన సాఫల్య కేంద్రం సంప్రదించింది. రహస్యంగా ఆమెకు డెలివరీ చేసి.. ఆ బిడ్డను పిల్లలు లేని వేరే దంపతులకు డబ్బులకు అమ్మేశారు. ఈ మహిళకు కొంత డబ్బు ముట్టచెప్పి అక్కడి నుంచి పంపేశారు.

మరో మహిళ విషయంలో... ఆమె భర్త నేరం చేసి జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చిన విషయం తెలిసింది. ఇలాంటి సమయంలో తాను బిడ్డను పోషించలేని బాధపడుతుండటంతో.. ఆమెను కూడా ఈ సంతాన సాఫల్య కేంద్రం వారు ఆశ్రయించారు. చి బిడ్డను తీసేసుకుని, అనంతరం ఆ బిడ్డను పిల్లలు లేని దంపతులకు విక్రయించారు. జైలు నుంచి వచ్చిన   భర్త...  బిడ్డ ఏడని నిలదీయడంతో ఆమె అసలు విషయం చెప్పింది. అనంతరం వారు చైల్డ్‌లైన్‌ ప్రతినిధులను ఆశ్రయించారు. దీంతో ‘సృష్టి’ ఆస్పత్రి ఆధ్వర్యంలో పిల్లల విక్రయం, అక్రమ రవాణా జరుగుతోందన్న అనుమానం వచ్చిన చైల్డ్‌లైన్‌ సంస్థ అధికారులు... మహారాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ప్పటి వరకూ అధికారికంగా ఆరుగురు పిల్లలను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఆస్పత్రి ఏజెంట్లు, సిబ్బంది... గ్రామాల్లో గర్భిణుల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పేదరికంతో బాధపడుతున్న వారిని గుర్తించేవారు. అనంతరం వారిని ఒప్పించి, డబ్బు ఆశచూపి డెలివరీ అయ్యాక పిల్లలను తీసుకుని అమ్ముకునే వారని సీపీ తెలిపారు. సదరు దంపతులకే ఆ బిడ్డ పుట్టినట్టు ధ్రువపత్రం కూడా ఇవ్వడంతో భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని బిడ్డల కొనుగోలుకు ఆసక్తి చూపేవారన్నారు. వాస్తవానికి ఆస్పత్రి నిర్వాహకులు 2010లో ‘సృష్టి టెస్ట్‌ట్యూబ్‌ సెంటర్‌’ ఏర్పాటు చేశారు. అయితే దానిపై  ఫిర్యాదులు, కేసులు నమోదుకావడంతో అనంతరం ఫెర్టిలిటీ సెంటర్‌గా పేరు మార్చారని చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. 


పిల్లలను అక్రమరవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసారు. ఇద్దరు ఆశావర్కర్లు వెంకటలక్ష్మి, అన్నపూర్ణ, డాక్టర్‌ తిరుమల ఈ ముఠాకు సహకరిస్తునట్టు గుర్తించారు... 

ఈ ఘటనపై విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా మీడియాతో మాట్లాడుతూ..పిల్లల అక్రమ రవాణా కేసులో యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండి నర్మత సహా ఆరుగుర్ని అరెస్ట్ చేశామన్నారు.