జన్మభూమి కార్యక్రమ నిర్వహణలో ప్రభుత్వం రోజురోజుకు వింత పోకడలకు పోతోంది. అభివృద్ధి కార్యక్రమాలపైన ఇచ్చిన హామీలపైన జనాలెవరూ అసలు అడిగేందుకు లేదు అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జన్మభూమి కార్యక్రమం మొదలైన దగ్గర నుండి అధికారపార్టీ నేతలు, ప్రభుత్వం వరస ఇదే విధంగా ఉంది. ఇక ప్రస్తుతానికి వస్తే, కృష్ణా జిల్లాలో వైసిపి సీనియర్ నేత పార్ధసారధిని పోలీసులు అరెస్టు చేశారు.

కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న ఆయనను మంగళవారం పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ జనాలు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేక తమని అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.

రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి సభకు వెళ్లకుండా విపక్ష నేతలను అడ్డుకుంటున్నారన్నారు. ప్రతి గ్రామ సభలోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, అయితే సమస్యలను లేవనెత్తే అవకాశమే ఇవ్వడం లేదన్నారు. నిలదీసిన విపక్ష నేతలను బలవంతంగా అరెస్ట్‌ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జన్మభూమి కార్యక్రమాలు నామమాత్రంగా జరుగుతున్నాయని, పోలీసులను అడ్డం పెట్టుకుని జన్మభూమి సభ నడిపిస్తున్నారని పార్థసారధి వ్యాఖ్యానించారు. గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని ఆయన అన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయంలో విపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇచ్చేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ప్రభుత్వ వైఖరికి నిరసిస్తూ వైసిపి నేతలు నోటికి నల్లరిబ్బన్‌ కట్టుకున్నారు. అలాగే వైఎస్‌ఆర్‌ సీపీ నేత పార్థసారధితో పాటు గ్రామ మాజీ సర్పంచ్‌ చంద్రశేఖర్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేసి కంకిపాడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు జన్మభూమికి వెళుతున్న తమను పోలీసులు అడ్డుకున్నారని గ్రామానికి చెందిన మహిళలు ఆరోపించారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళుతున్న తమని భయపెట్టి నోరు మెదపకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.