ఏలూరు: మహిళలతో పరిచయాలు పెంచుకొని బంగారం దోచుకొంటున్న నిందితుడిని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.  ఆయుర్వేద డాక్టర్, ఫైనాన్స్‌ వ్యాపారం, బిజినెస్‌ అంటూ మాయమాటలు చెప్పి మహిళలకు మత్తు బిళ్ళలు ఇచ్చి వారినుంచి బంగారు అభరణాలు, నగదు కాజేసే నిందితుడు చేపూరు చంద్రబాబు అలియాస్‌ శేఖర్‌ రెడ్డి అలియాస్‌ వంశీకృష్ణను పోలీసులు  అరెస్ట్ చేశారు.

ఏలూరులోని ఎస్పీ కార్యాలయంలో శనివారం నాడు ఎస్పీ కె. నారాయణ ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు. నెల్లూరు జిల్లా కోట మండలం శ్యాంసుందరపురానికి చెందిన చేపూరు చంద్రబాబు పలు మోసాలకు పాల్పడినట్టుగా తేలిందన్నారు. రియల్‌ ఎస్టేట్, బిజినెన్స్, ఫైనాన్స్, ఆయుర్వేదిక్‌ డాక్టర్‌ అని పరిచయం చేసుకుని మహిళల నగలు, నగదును కాజేసినట్టుగా చెప్పారు.

 తాను దొరికిపోకుండా నకిలీ ఆధార్‌కార్డులు తయారు చేసుకుని వాటిని వినియోగించేవాడన్నారు.. ఒక్కొక్కకరికి ఒక్కో సిమ్‌ వాడడం అతని ప్రత్యేకత. గత కొన్నేళ్ళుగా నెల్లూరు, తిరుపతి, నాయుడుపేట, గుంటూరు, కృష్ణాజిల్లాలోనూ అనేక నేరాలకు పాల్పడినట్టుగా ఎస్పీ చెప్పారు. ఇంతవరకు సుమారుగా 20కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉండటమే కాదు, శిక్షలు కూడా అనుభవించాడని ఎస్పీ తెలిపారు.. నెల్లూరు జిల్లా కోట పోలీస్‌స్టేషన్‌లో డీసీ షీట్‌ కూడా తెరిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

టూటౌన్‌ స్టేషన్‌ పరిధిలోని తంగెళ్ళమూడి ఎంఆర్‌సీ కాలనీకి చెందిన మహిళ, కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన ఒక మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.  పలు జిల్లాల్లోని మహిళల నుండి నిందితుడు సుమారు రూ. 9 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకొన్నట్టుగా ఎస్పీ తెలిపారు. 
ఈ కేసును చేధించడంలో కీలకంగా వ్యవహరించిన  పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.