ఓ దొంగ దారుణానికి పాల్పడ్డాడు. ఓ ఇంట్లో చోరీకి వచ్చి.. ఆ ఇంటి యజమానిని కూడా చంపేశాడు. ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కాశిపాడు లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కాశిపాడు గ్రామంలో పులిపాటి రాధాకృష్ణమూర్తి(68), వెంకటనర్సమ్మ దంపతులు చిల్లర దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి వారు వ్యాపారం ముగించుకొని ఇంటికి వచ్చేసరికి దొంగ ఉండటం గమనించారు.

ఆ దొంగ కూడా అదే గ్రామానికి చెందిన మల్లెల గోపి గా ఆ దంపతులు గుర్తించారు. వెంటనే ఆ దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే.. వీరి నుంచి పారిపోవడానికి ప్రయత్నించే క్రమంలో... గోపి ఆ వృద్ధ దంపతులపై దాడికి దిగాడు. ఈ క్రమంలో తీవ్రగాయాలై రాధాకృష్ణ మూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

వెంకటనర్సమ్మకు తీవ్రగాయాలై అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ఇద్దరూ చనిపోయారనుకున్న దొంగ ఆమె ఒంటిపై బంగారంతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు వెళ్లిన కాసేపటికే వెంకటనర్సమ్మకు మెలకువ రాగా.. విషయాన్ని వెంటనే తన కుమారుడికి ఫోన్ చేసి చెప్పింది.

వెంటనే స్పందించిన ఆమె కుమారుడు పోలీసులకు, అంబులెన్స్ కి సమాచారం అందించాడు.  వెంకటనర్సమ్మను చికిత్స నిమిత్తం మెరుగైన ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.