బాబా వేషంలో తిరుగుతూ.. యువతులను తన వలలో వేసుకోవడానికి ఓ దొంగ బాబా వేషాలు వేస్తున్నాడు. తన కోరిక తీర్చకుంటే.. మిమ్మల్ని నాశనం చేస్తానని, అంతం చేస్తానంటూ యువతులను భయబ్రాంతులకు గురిచేసేవాడు. కాగా..  ఈ సంఘటన శ్రీకాళహస్తి పట్టణంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూసలవీధికి చెందిన ఓ వ్యక్తి బాబా అవతారమెత్తి చేతబడులు చేస్తా.. పూజలతో ఉద్యోగాలిప్పిస్తానంటూ ప్రజలను నమ్మబలికాడు. ఈ క్రమంలో మహిళలను, యువతలను లోబర్చుకుని తన కామవాంఛను తీర్చుకుంటున్నాడు. తన కోరిక తీర్చకపోతే చేతబడి చేసి మీ కుటుంబాన్ని అంతం చేస్తానంటూ ఇద్దరు యువతులను బెదిరించాడు. భయబ్రాంతులకు గురైన ఆ యువతుల కుటుంబసభ్యులు గురువారం పోలీసులను ఆశ్రయించారు.    

పోలీసులు సదరు బాబాను స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. వెంటనే అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు రంగప్రవేశం చేసి కేసు నమోదు కాకుండా రాజీ ప్రయత్నం చేశారు. శుక్రవారం ఉదయం సమస్య ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఆడబిడ్డల జీవితాలకు ఇబ్బంది కలుగుతుందేమోనని ఆ కుటుంబం రాజీకి అంగీకరించినట్లు చెబుతున్నారు. రాసలీలలకు పాల్పడుతున్న బాబాకు అధికార పార్టీ నేతలు అండగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న బాబాపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.