ఓ వైపు దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతోంది. అయితే.. ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే అని తాజాగా జరుగుతున్న సంఘటలే చెబుతున్నాయి. మూఢనమ్మకాలు, పునర్జన్మలు నమ్మి.. ఇటీవల మదనపల్లెలో విద్యావంతులైన తల్లిదండ్రులే తమ ఇద్దరు కుమార్తెలను అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. 

అలాంటివారిని మూఢనమ్మకాల వైపు నడిపించే స్వామీజీలు చాలా మంది మన చుట్టూనే ఉన్నారు. తాజాగా..  అలాంటి ఓ స్వామీజీ గుట్టు బయట పడింది. ఈ సంఘటన కూడా చిత్తూరులోనే చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూజల పేరిట ఘరానా మోసానికి పాల్పడ్డాడు ఓ దొంగ స్వామీజీ. వెంకట్‌ రెడ్డి అనే వ్యక్తి స్వామీజీ అవతారం ఎత్తి తన అనుచరుడు చరణ్‌తో కలసి దందాలకు పాల్పడుతుండేవాడు. ఈ క్రమంలో వెంకట్‌ రెడ్డి కన్ను స్థానికంగా ఉన్న కృష్ణా రెడ్డి కుటుంబం మీద పడింది.

ఈ క్రమంలో ‘‘మీ బిడ్డను ఫలానా వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాలి. లేకుంటే కుటుంబంలో ప్రాణ నష్టం తప్పదు’’ అని వెంకట్‌ రెడ్డి.. కృష్టా రెడ్డిని బెదిరించాడు. అతడి మాటలతో బెంబెలేత్తిన కృష్టా రెడ్డి మెడిసిన్‌ చేస్తోన్న తన కుమార్తెని వెంకటరెడ్డి అనుచరుడు చరణ్‌కి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇక పెళ్లైన కొద్ది రోజులకే చరణ్‌ భార్యను చిత్ర హింసలకు గురిచేయడం ప్రారంభించాడు. మోసపోయామని తెలిసి కృష్టా రెడ్డి కుటుంబం పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.