Asianet News TeluguAsianet News Telugu

సడన్ గా మోదీకి వెంకయ్యనాయుడుపై అంత ప్రేమెందుకు పుట్టుకొచ్చిందో..!!

మాజీ రాష్ట్రపతి యాక్టివ్ రాజకీయాలకు దూరమయ్యారు. అలాంటిది ఆయనను ప్రధాని మోదీ ఇంతలా ఎందుకు ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవాళ వెంకయ్య పుట్టినరోజున ఏకంగా పెద్ద వ్యాసమే రాసుకొచ్చారు మోదీ... ఇంత ప్రేమ ఎందుకబ్బా..!! 

PM Narendra Modi extends Birthday Wishes to Venkaiah Naidu AKP
Author
First Published Jul 1, 2024, 9:06 PM IST

Venkaiah Naidu Birthday : ముప్పవరపు  వెంకయ్యనాయుడు... రాజకీయాల గురించి తెలిసిన ప్రతిఒక్కరికీ ఈ పేరు సుపరిచితమే. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. సామాన్య విద్యార్థి నాయకుడి నుండి అంచెలంచెలుగా ఎదిగి చివరకు కేంద్ర మంత్రిగా, దేశ ఉపరాష్ట్రపతిగా అత్యున్నత పదవులను అదిరోహించిన తెలుగుబిడ్డ వెంకయ్యనాయుడు. తన వాగ్దాటికి ప్రత్యర్థులను సైతం మెప్పించగల సమర్దుడు వెంకయ్యనాయుడు... ఆయన రాజకీయాలకు కాదు ప్రాసలతో కూడిన స్పీచులకు అభిమానులు వున్నారంటే అతిశయోక్తి కాదు.విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ మంచి నేతగా పేరుతెచ్చుకున్న వెంకయ్య వ్యక్తిగతంగాను మంచిపేరు సంపాదించుకున్నారు. 

ఇవాళ (జూలై 1 సోమవారం) వెంకయ్యనాయుడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు కేంద్రమంత్రులు, తెలుగు రాష్ట్రాలకు    చెందిన రాజకీయ ప్రముఖులు ఆయనకు భర్త్ డే విషెస్ తెలిపారు. మోదీ అయితే బిజెపి విద్యార్థి విభాగం ఏబివిపి నుండి ఉపరాష్ట్రపతి వరకు వెంకయ్య రాజకీయ ప్రస్థానం గురించి పెద్ద వ్యాసమే రాసారు. ఇలా వెంకయ్యనాయుడిని పుట్టినరోజు సందర్భంగా  పొగడ్తలతో ముంచెత్తారు ప్రధాని మోదీ. 

అయితే వెంకయ్యనాయుడు ప్రస్తుతం యాక్టివ్ రాజకీయాలకు దూరంగా వున్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి కేబినెట్ లో గ్రామీణాభివృద్ది, మోదీ కేబినెట్ లోనూ పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పనిచేసారు. ఇలా కేంద్రమంత్రిగా కొనసాగుతున్న వెంకయ్యను 2017 లో దేశ ఉపరాష్ట్రపతిగా నియమించడంతో యాక్టివ్ రాజకీయాలకు దూరమయ్యారు. 2022 లో ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగిసిన తర్వాత రాజకీయాలకు దూరంగా వ్యక్తిగత జీవితం గడుపుతున్నారు.  

వెంకయ్యనాయుడు రాజకీయాకు దూరమయ్యారా..? దూరం చేసారా..? 

భారతీయ జనతాపార్టీలో అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటివారి వయసు కాకపోయిన రాజకీయంగా వారితో సమకాలీకులు వెంకయ్యనాయుడు.ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో వెంకయ్య కేంద్ర మంత్రి. అంటే జాతీయ రాజకీయాల్లో మోదీ, అమిత్ షా ల కంటే వెంకయ్యనాయుడు సీనియర్. ఇదే ఆయనను రాజకీయాలకు దూరం చేసిందనేని విశ్లేషకుల అభిప్రాయం.  

దేశంలో మోదీ, అమిత్ షా ల శకం మొదలయ్యాక సీనియర్ నాయకులను పక్కనబెట్టడం ప్రారంభమయ్యింది. వయసు మీదపడిన వారిని రాజకీయాల నుండి తప్పిస్తూ కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే సాంప్రదాయం ప్రారంభమయ్యింది. ఇలా 75 ఏళ్ల వయసు దాటిందని అద్వానీ వంటివారిని పక్కనబెట్టేసారు. కానీ వెంకయ్యనాయుడు విషయంలో అలా కాదు. వయసు పేరుతో కాకుండా రాజ్యాంగబద్దమైన పదవి పేరిట ఆయనను యాక్టివ్ రాజకీయాలకు దూరం చేసారనే అనుమానాలున్నారు. కావాలనే వెంకయ్యనాయుడు పక్కనబెట్టారనే ప్రచారమూ రాజకీయాల్లోనే కాదు తెలుగు ప్రజల్లోనూ సాగింది. 
 
తెలుగు రాష్ట్రాల నుండి నీలం సంజీవరెడ్డి తర్వాత రాష్ట్రపతి పదవికి సరిపడా  అర్హతలు, అనుభవం వెంకయ్యనాయుడు వున్నాయి. దీంతో ఆయనకు ఉపరాష్ట్రపతి నుండి రాష్ట్రపతిగా ప్రమోషన్ దక్కుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆయనను కాదని ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసింది బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ కూటమి. ఉపరాష్ట్రపతిగా కూడా ఆయనను మరోసారి కొనసాగించలేదు. ఇలా కావాలనే వెంకయ్యనాయుడు ను అవమానకరంగా రాజకీయాల నుండి దూరం చేసారనే ప్రచారం వుంది. 

ఇప్పుడేందుకు వెంకయ్యపై మోదీ అంత ప్రేమ చూపిస్తున్నారు..?  

ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగిసిన తర్వాత వెంకయ్యనాయుడు ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయారు. రాజకీయాలను పూర్తిగా దూరం పెట్టి హాయిగా కుటుంబంతో జీవిస్తున్నారు. బిజెపి వాళ్లు కూడా ఆయనను దాదాపు మరిచిపోయారు. అయితే పరిస్థితులన్నీ ఒకేలా వుండవు... ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతుంటాయి... రాజకీయాల్లో ఇది మరీ ఎక్కువగా జరుగుతుంటుంది. ఇలాగే వెంకయ్యనాయుడును రాజకీయాలకు దూరం చేసినవారికే ఇప్పుడాయన అవసరం పడింది. అందువల్లే ఆయనను బిజెపి అక్కునచేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. 

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వెంకయ్యనాయుడుకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు.  మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినతర్వాత మోదీ స్వయంగా వెంకయ్య ఇంటికి వెళ్లి కలిసారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం కార్యక్రమంలోనూ వెంకయ్యను ఆత్మీయంగా పలకరించారు. ఇక ఇవాళ అంటే వెంకయ్య పుట్టినరోజున ఆయనపై పెద్ద వ్యాసమే రాస్తూ ప్రశంసలతో ముంచెత్తారు ప్రధాని మోదీ. అయితే బిజెపి వెంకయ్యనాయుడు జపం చేయడంవెనక రాజకీయాలు దాగివున్నాయన్నది అర్థమవుతోంది. 

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే మెజారిటీ రాలేదు... కాబట్టి ఎన్డిఏ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం పార్టీ పాత్ర చాలా కీలకమైనది... బిజెపి తర్వాత ఎన్డిఏలో అత్యధిక ఎంపీ సీట్లు కలిగిన పార్టీ టిడిపి. కాబట్టి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా బిజెపికి చాలా ముఖ్యం. ఇదే  ఇప్పుడు వెంకయ్యనాయుడిని బిజెపి తెరపైకి తీసుకురావడానికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

వెంకయ్యనాయుుడికి  తెలుగు రాజకీయాలపై మరీముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై మంచి పట్టుంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలు వున్నాయి. గతంలో వెంకయ్య కేంద్రమంత్రిగా వుండగా ఏపీకి బారీ నిధులు కేటాయించారు... అలాగే కొత్తగా ఏర్పడిన చంద్రబాబు సర్కార్ కు అండాదండగా వున్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి, టిడిపి కి మధ్య వెంకయ్యను వారధిగా ఉపయోగించాలన్నది మోదీ ప్లాన్ గా తెలుస్తోంది. అందువల్లే ప్రధాని మోదీ తమ సీనియర్ వెంకయ్యనాయుడును ప్రసన్నం చేసుకునే పనిలో వున్నారనేది రాజకీయ పండితుల మాట. నిజంగా అంత ప్రేముందా లేక రాజకీయాల కోసమే చేసారా తెలీదుగానీ వెంకయ్యనాయుడు పుట్టినరోజున ప్రధాని మోదీ రాసిన వ్యాసం అందరినీ ఆకట్టుకుంటోంది...మరీముఖ్యంగా తెలుగువారికి మరింత ఆనందాన్నిచ్చింది.   


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios