Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో ప్ర‌ధాని టూర్: ఆట మెుదలైనట్లేనా....

తెలంగాణ ఎన్నిక‌లు ముగియ‌టంతో ఇక ఏపి రాజ‌కీయాలు వేడెక్క‌నున్నాయి. త్వరలో ప్రధాని నరేంద్రమోదీ ఏపీలో పర్యటిస్తారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ వేడి మరింత రాజుకుంటోంది. ప్రధాని నరేంద్రమోదీపైనా, కేంద్రప్రభుత్వంపైనా సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 
 

pm modi will be participating ap meetings in january 2019
Author
Amaravathi, First Published Dec 17, 2018, 7:39 PM IST

అమరావతి: తెలంగాణ ఎన్నిక‌లు ముగియ‌టంతో ఇక ఏపి రాజ‌కీయాలు వేడెక్క‌నున్నాయి. త్వరలో ప్రధాని నరేంద్రమోదీ ఏపీలో పర్యటిస్తారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ వేడి మరింత రాజుకుంటోంది. ప్రధాని నరేంద్రమోదీపైనా, కేంద్రప్రభుత్వంపైనా సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో మోదీ ఏపీలో పర్యటనకు శ్రీకారం చుట్టడం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం వర్సెస్ ఏపీగా జరుగుతున్న పోరులో నేరుగా ప్రధాని నరేంద్రమోదీ రంగంలోకి దిగుతున్నట్లేనని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇక ఏపీలో ఆట మెుదలైనేట్లనని బీజేపీ చెప్తోంది.  

ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం మోసం చేసిందని విమర్శలు గుప్పిస్తోంది చంద్రబాబు అండ్ టీం. ప్రత్యేక హోదా అడిగితే ఇవ్వనందుకు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామమని అప్పటి నుంచి కేంద్రం ఐటి, ఈడీ దాడుల‌తో భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని విమ‌ర్శిస్తున్నారు. 

టీడీపీ విమర్శలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావులు కౌంటర్ ఇస్తున్నారు. అయితే కేంద్రంపై ఏపి ప్ర‌భుత్వం చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెప్పేందుకు, కేంద్రం చేసిన సాయం వివ‌రించేందుకు స్వ‌యంగా ప్ర‌ధాని మోదీ రంగం లోకి దిగుతున్నారు. 

అందుకు గుంటూరు జిల్లానే టార్గెట్ గా ఎంచుకున్నారు ప్రధాని మోదీ. ఏపి కేంద్రంగానే ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్తూ టీడీపీకి చెక్ పెట్టాల‌ని ప్రధాని భావిస్తున్నారు. అందులో భాగంగా జనవరి ఆరున ప్ర‌ధాని మోదీ ఏపిలో ప‌ర్య‌ట‌ించనున్నారు. 

దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు సెమీ ఫైన‌ల్స్ గా భావిస్తున్న ఎన్నిక‌లు ముగియ‌డంతో ఇక ఏపిపై దృష్టి పెట్టాల‌ని బిజెపి వ్యూహంగా భావిస్తోంది. జనవరి 6న ప్రధాని నరేంద్రమోదీ పర్యటన అలాగే పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ముగిసిన అనంతరం బిజెపి జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా ఏపిలో ప‌ర్య‌టించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. 

ఇప్ప‌టి వ‌ర‌కు ఏపికి కేంద్రం ఎలాంటి సాయం చెయ్యలేదని అన్యాయం చేసింద‌ని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అండ్ టీం చేస్తున్న ఆరోపణలతో ఏపీలో బీజేపీ ఇమేజ్ డామేజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ నేతలు బీజేపీ జాతీయ నాయకత్వం వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారని సమాచారం.

 ఏపీ నేతల విజ్ఞప్తితోపాటు ఆంధ్రప్రదేశ్ తోపాటు ఇతర రాష్ట్రాల్లో బీజేపీని విమర్శించడంపై మోదీ సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. చంద్ర‌బాబు కాంగ్రెస్ తో చేతులు క‌ల‌ప‌టం, కేంద్రప్ర‌భుత్వ తీరు విమర్శలు గుప్పించడంతో ఆగ్రహంతో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం ఇక ఉపేక్షించకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.  

అందులో భాగంగా ప్ర‌ధాని మోదీ ఏపిలో ప‌ర్య‌ట‌ించి కేంద్రం చేసిన సేవలను వివరించాలని, టీడీపీకి ఏపీలోనే చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారపడుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ధీటుగా సమాధానం చెప్పకపోతే పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతుందని మోదీ భావిస్తున్నారు. 

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బొక్క బోర్లా పడటంతో ఆంధ్రప్రదేశ్ లో అయినా అలాంటిది జరగకుండా ఉండేందుకు వరుస సభలతో టీడీపీకి ఎక్కడికి అక్కడ చెక్ పెట్టాలని భావిస్తోంది.  

ఇకపోతే జనవరి 6న ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభకు వేదికలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అనుకున్నప్పటికీ అక్కడ నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం అంగీకరించలేదు. 

మరోవైపు మాజీమంత్రి మాణిక్యాలరావు ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో నిర్వహిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించారు. అయితే అక్కడ  కూడా కుదిరే అవకాశం లేకపోవడంతో ఇక కన్నా లక్ష్మీనారాయణ సొంత జిల్లా అయిన గుంటూరులో పెట్టేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 

గుంటూరు జిల్లా నాగార్జున యూవర్సిటీ ఎదుట బైబిల్‌ మిషన్‌ గ్రౌండ్స్‌లో జనవరి 6న ప్రధాని నరేంద్రమోదీ మెుదటి బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

 వేదిక జాతీయ రహదారికి సమీపంలో ఉండడం, జన సమీకరణకు రాష్ట్రం మధ్యలో ఉండడం, అటు రాయలసీమ, ఇటు ఉత్తర కోస్తా నుంచి జన సమీకరణకు అవకాశం ఉండడంతో ఈ ప్రదేశాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది. 5 లక్షల మందికి పైగా జన సమీకరణ చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
 
ఇదే వేదిక దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవలే ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవవర్గ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో రాష్ట్ర నాయకత్వం చర్చించినట్లు తెలుస్తోంది. అయితే మోదీ రెండు సభలలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీజేపీ తెగ సంబరపడిపోతుంది. 

రాష్ట్రంలో ఇప్పటికే ఇంటింటికి బీజేపీ కార్యక్రమంతో ప్రజల వద్దకు చేరుకుంటున్న ఆ పార్టీకి మోదీ సభ మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. ఇకపోతే సభ అనంతరం మోదీ  శ్రీకాకుళం నుంచి బీజేపీ ప్రారంభించబోయే బస్సు యాత్రను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే మోదీ పర్యటనపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మోదీ ఈ బహిరంగ సభలోనైనా ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలపై సానుకూల ప్రకటన చేస్తారా...లేక రాజకీయ విమర్శలకే పరిమితం చేస్తారా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios