అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన వాయిదా పడింది. కొత్త సంవత్సరంలో జనవరి 6న ఏపీలో మోదీ పర్యటన ఉందని బీజేపీ కేంద్ర వర్గాలు సైతం స్పష్టం చేశాయి. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. 

విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో పర్యటించి వేదికలను పరిశీలించింది. ఆఖరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన సొంత జిల్లాలో మోదీ పర్యటన పెట్టుకున్నారు. గుంటూరులో బహిరంగ సభకు ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు. 

ఇంతలో చావు కబురు చల్లగా చెప్పినట్లు మోదీ టూర్ వాయిదా పడిందని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి.కేరళ టూర్ అనంతరం ఏపీకి వచ్చేలా ప్రధాని షెడ్యూల్ ఖరారు చేసింది వ్యక్తిగత సిబ్బంది. అయితే ఆకస్మిక కార్యక్రమాల వల్ల ప్రధాని తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.  

అయితే జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మెుదటి వారంలో మోదీ ఏపీలో పర్యటించే అవకాశముందని కేంద్ర వర్గాలు తెలిపాయి. మోదీ వస్తారు ఏపీకి ఏం చేశారో అవి చెప్పి టీడీపీకి తగిన గుణపాఠం చెప్తారంటూ బీజేపీ నేతల ఆశలు ఆడియాశలుగా మారాయి. 

అటు టీడీపీ సైతం మోదీ పర్యటనపై పెద్ద రాద్ధాంతమే చేస్తోంది. ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పి అడుగుపెట్టాలంటూ సాక్షాత్తు సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు అండ్ కో హెచ్చరిస్తున్నారు. విభజన గాయంపై కారం చల్లేందుకు వస్తున్నారా అంటూ విమర్శలు సైతం గుప్పించారు. దీంతో మోదీ పర్యటన రద్దవ్వడంతో ఆ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.