మోడీ వ్యాఖ్యలను మసాలా దట్టించి అనువాదించిన పురంధేశ్వరి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని మొత్తం యధాతథంగా అనువాదం చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. వైసీపీపై విమర్శలకు సంబంధించిన వ్యాఖ్యలను మాత్రం కొంచెం ఘాటుగా అనువాదం చేశారు. ఈ పరిణామంపై చర్చ జరుగుతున్నది.
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీలోని చిలకలూరిపేటలో నిర్వహించిన సభలో మాట్లాడిన సంగతి తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేనలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సభలో ప్రధాని మోడీ మాటలు కూటమిలో హుషారు పెంచేలా లేవని, అధికార వైసీపీపై ఘాటైన విమర్శలు చేయలేదనే నిరాశలో టీడీపీ, జనసేన శ్రేణులు నిరాశ చెందాయి. ప్రధాని మోడీ ప్రసంగం కేవలం బీజేపీ ప్రయోజనాలే ప్రధానంగా సాగినట్టు చర్చలు జరుగుతున్నాయి. కనీసం చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కావాలని అనలేడని, వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందనైనా అనలేడని గాయపడ్డాయి. ఇదిలా ఉంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాత్రం టీడీపీ, జనసేనల్లో హుషారు నింపే ప్రయత్నం చేశారని చర్చ జరుగుతున్నది.
ఇంతకీ మోడీ చేసిన వ్యాఖ్యలు ఏమిటీ..? అందుకు పురంధేశ్వరి చేసిన అనువాదం ఏమిటీ? నరేంద్ర మోడీ హిందీ భాషలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఆయన తన ప్రసంగంలో ‘యహా కే లోగ్.. రాజ్య సర్కార్ సే ఇత్నా ఆక్రోశిత్ హై కి ఉసే హఠానే కా మన్ కర్ చుకే హై (ఇక్కడి ప్రజలు ఎంత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ సారి ప్రభుత్వాన్ని మార్చాలని నిర్ణయం తీసేసుకున్నారు’ అని మాట్లాడారు. కానీ, పురంధేశ్వరి ఇవే వ్యాఖ్యలను కొంచెం ఘాటుగా అనువాదం చేశారు.
Also Read: YS Sharmila: జగన్, బాబులను ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీ కాదా?: మోడీపై షర్మిల విమర్శలు
‘ఏదైతో రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం ఉన్నదో దానిని పెకలించి విసిరివేయాలని ఆంధ్ర ప్రజలు నిర్ణయం తీసుకున్నారని నాకైతే అర్థమవుతున్న విషయం’ అని పురంధేశ్వరి అనువాదం చేశారు. ఇందులో ప్రధాని మోడీ చెప్పిన వ్యాఖ్యల అర్థమే ధ్వనిస్తున్నప్పటికీ.. పురంధేశ్వరి చేర్చిన పదాలు కొన్ని ఉన్నాయి. ఇందులో ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందనే పదం సొంతంగా పురంధేశ్వరి చేర్చారు. కూకటివేళ్లతో పెకలించి వేయాలనే పదాన్ని కూడా ఆమెను అదనంగా చేర్చినట్టు తెలుస్తూనే ఉన్నది. ఈ పదాల చేర్పుతో ఆమె కూటమిని.. టీడీపీ, జనసేన పార్టీల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారని చర్చిస్తున్నారు.