Asianet News TeluguAsianet News Telugu

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో దేశంలోనే ఏపీ టాప్..: జగన్ సర్కారుకు కేంద్ర ఆరోగ్యశాఖ కితాబు

కరోనా నియంత్రణ కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జగన్ సర్కార్ సమర్దవంతంగా నిర్వహిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. 

pm modi meeting with all states cms... union health ministry appreciates ap government
Author
Amaravati, First Published Jan 14, 2022, 11:01 AM IST

అమరావతి: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా (corona virus) మహమ్మారిని కట్టడిచేసే విషయంలో ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ (jagans government) సమర్ధవంతంగా పనిచేస్తోందని కేంద్ర ప్రభుత్వం (indian government) కితాబిచ్చింది. కరోనా వ్యాక్సిన్ (corona vaccine) మొదటి డోస్‌ 100శాతం పూర్తిచేసిన రాష్ట్రాల్లో ఏపీ (ap) కూడా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక ఇటీవలే 15–18ఏళ్ల మధ్య వయసున్న యువతీయువకులకు వ్యాక్సినేషన్ ప్రారంభించగా... అత్యధిక వ్యాక్సిన్లు వేసిన రాష్ట్రాలో ఏపీ టాప్ లో నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

కోవిడ్‌ విస్తరణ, నివారణా చర్యలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) వర్చువల్‌ గా సమావేశమయ్యారు. ఈ వీడియో సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో కోవిడ్‌ విస్తరణ పరిస్థితులను ప్రజంటేషన్‌ ద్వారా సీఎంలకు వివరించింది కేంద్ర ఆరోగ్యశాఖ. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. 

ఇలా ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం జగన్ పాల్గొనగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) మాత్రం పాల్గొనలేదు. తెలంగాణలో టీఆర్ఎస్, బిజెపిల మధ్య దుమారం రేగుతున్న నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ప్రధానితో సమావేశానికి హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం కార్యాలయం మాత్రం ప్రధానితో సమావేశానికి కేసీఆర్ గైర్హాజరుపై ఎలాంటి ప్రకటన చేయలేదు.  

ముఖ్యమంత్రులతో సమావేశం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ...  కోవిడ్‌పై పోరాటానికి వ్యాక్సినే అతిపెద్ద ఆయుధమన్నారు. కరోనా వ్యాప్తి కట్టడిపైననే దృష్టిపెట్టాలని ప్రధాని మోదీ ముఖ్యమంత్రులకు సూచించారు. ఇప్పటికే దేశంలో 3 కోట్ల మంది టీనేజర్లకు వ్యాక్సినేషన్ చేశామని ఆయన తెలిపారు. పండుగ సమయంలో మరింత అప్రమత్తంగా వుండాలని ప్రధాని దేశ ప్రజలకు సూచించారు. 

ఇక భారత్‌లో కరోనా మహమ్మారి కలకలం కొనసాగుతుంది. రోజురోజుకు నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,64,202 మందికి covid పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అది కిందటి రోజు నమోదైన కేసులతో పోలిస్తే 4.87 శాతం అధికం. ఇక, తాజాగా కరోనాతో 315 మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,85,350కి చేరింది. నిన్న కరోనా నుంచి 1,09,345 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,48,24,706కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.

ప్రస్తుతం దేశంలో 12,72,073 కరోనా యాక్టివ్ కేసుల ఉన్నాయి. కరోనా కేసుల పెరుగుదలతో దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఇది 14.78 శాతంగా ఉంది. మరోవైపు వీక్లీ పాజిటివిటీ రేటు 11.83 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు.. 95.20 శాతంగా, యాక్టివ్ కేసులు.. 3.48 శాతంగా ఉన్నాయి.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 73,08,669 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,55,39,81,819కి చేరింది. 

మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 5,753 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios