అశేష జనసమూహం మధ్య ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను వెంటపెట్టుకుని మోదీ రోడ్ షో కొనసాగుతోంది. 

విశాఖపట్నం : భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన ఐఎన్ఎస్ గరుడ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి స్వాగతం పలికారు. 

ఇక ప్రస్తుతం ప్రధాని మోదీ రోడ్ షో కొనసాగుతోంది. విశాఖలోని సిరిపురం జంక్షన్ వద్ద ప్రారంభమైన ఈ రోడ్ షో ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలోని బహిరంగ సభాస్థలి వరకు సాగనుంది. ప్రధాని ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. ఆయన వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వున్నారు. 

మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. వీరందరితో రోడ్ షో మార్గం జనసంద్రంగా మారింది.ప్రధానిపై పూలు చల్లుతూ కొందరు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. బిజెపి, టిడిపి, జనసేన నాయకులు,కార్యకర్తలు ఈ రోడ్ షో లో భారీగా పాల్గొన్నారు. 

వీడియో

YouTube video player

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సమయంలోనూ ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ ఇలాగే ఒకే వాహనంలో రోడ్ షో చేపడుతూ ప్రచారం చేపట్టారు.మళ్లీ ఇప్పుడు ఇలా అధికారంలోకి వచ్చాక రోడ్ షో నిర్వహిస్తున్నారు. దాదాపు అరగంటకు పైగా ఈ రోడ్ షో సాగనుంది... ఏయూ కాలేజీ మైదానంలోని బహిరంగ సభాస్థలంలో ఇది ముగుస్తుంది. ఆ తర్వాత బహిరంగ సభ ప్రారంభం అవుతుది.