Asianet News TeluguAsianet News Telugu

రేషన్ పై ఏపీకి కేంద్రం ఝలక్: దుకాణాల వద్దే పంపిణీ

సంక్షేమ పథకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సైలెంట్‌ వార్‌ మొదలయింది. రేషన్‌ డోర్‌ డెలివరీ వల్ల తమప్రాయోజిత పథకాలకు అనుకున్నంత ప్రచారం రావటం లేదని భావించిన కేంద్రం ఉచిత నిత్యావసరాలను తామే ఇస్తున్నట్టు కార్డుదారులకు విధిగా తెలిచేయాలనే ఆలోచన చేసింది

PM garib kalyan yojana banner will be displayed from july 16 every ration shop lns
Author
Vijayawada, First Published Jul 6, 2021, 4:11 PM IST

అమరావతి: సంక్షేమ పథకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సైలెంట్‌ వార్‌ మొదలయింది. రేషన్‌ డోర్‌ డెలివరీ వల్ల తమప్రాయోజిత పథకాలకు అనుకున్నంత ప్రచారం రావటం లేదని భావించిన కేంద్రం ఉచిత నిత్యావసరాలను తామే ఇస్తున్నట్టు కార్డుదారులకు విధిగా తెలిచేయాలనే ఆలోచన చేసింది. అందులో భాగంగా తమ కోటా నిత్యావసరాలను చౌక దుకాణాల దగ్గరే పంపిణీ చేయాలని మెలిక పెట్టింది. పనిలో పనిగా ఆయా దుకాణాల వద్ద ‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన’ బ్యానర్లను కూడా విధిగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 

రేషన్‌ డోర్‌ డెలివరీ వల్ల కేంద్ర నిత్యావసరాల కోటాకు ఆశించిన స్థాయిలో ప్రచారం లేకపోగా, దీనిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కేంద్ర కోటా నిత్యావసరాల పంపిణీని చౌక ధరల దుకాణాల దగ్గరే ఇవ్వాలని మెలిక పెట్టింది. ఆహార భద్రతా చట్టానికి లోబడి అందించే కోటా కాబట్టి ఉచిత నిత్యావసరాలను కేంద్రం కోరినట్టే పంపిణీకి అంగీకరించక తప్పలేదు. 

ఈ నెల 16 నుంచి ఎక్కడికక్కడ డిపోల దగ్గరే కేంద్ర కోటా బియ్యం పంపిణీ చేయటానికి సివిల్‌ సప్లయిస్‌ అధికారులు చర్యలు చేపట్టారు. చౌక దుకాణాల దగ్గర ‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన’ ఉచిత రేషన్‌ బ్యానర్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రం నిర్దేశించింది. కేంద్ర ప్రచారానికి తమ ఖర్చు ఎందుకనుకున్నారేమో తెలియదు కానీ ఏపీ సివిల్‌ సప్లయిస్‌ ఏతావాతా ఈ బ్యానర్ల ఏర్పాటు బాధ్యతను డీలర్ల మీదకు నెట్టివేసింది. 

ఈ పోస్‌ వ్యవస్థ ద్వారా అదనపు ఆదాయానికి బ్రేక్‌ పడి ఎండీయూ ఆపరేటర్ల ద్వారా స్టాకిస్టులుగానే పరిమితమైన రేషన్‌ డీలర్లకు ఈ బ్యానర్ల ఏర్పాటుకు సంబంధించిన ఆదేశాలు పుండుమీద కారం చల్లినట్టు అవుతున్నాయి. మీ పథకాల ప్రచారానికి మేము సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని బ్యానర్లు పెట్టుకోవటమేమిటని ప్రశ్నిస్తున్నారు.

 డీలర్లు పట్టించుకోవటం లేదని తెలిసి సివిల్‌ సప్లయిస్‌ ఉన్నతాధికారులు డీలర్లే బ్యానర్లు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవాలని కింది స్థాయి అధికారులకు మెసేజ్‌లు పంపుతున్నారు. దీంతో కింది స్థాయి అధికారులు డీలర్ల మీద ఒత్తిడిని తీసుకు వస్తున్నారు. కృష్ణాజిల్లాలో పెద్ద ఎత్తున డీలర్ల మీద అధికార యంత్రాంగం ఒత్తిడి చేస్తుండటంతో వారు లబోదిబోమంటూనే ఇక తప్పదని భావించి చేతి చమురు వదిలించుకుని మరీ బ్యానర్లకు ఆర్డర్లు ఇస్తున్నారు. 

ఈ బ్యానర్లను సింగిల్‌గా వేయటం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుందని డీలర్లంతా మూకుమ్మడిగా ఆర్డర్‌ ఇవ్వటం వల్ల ఖర్చు తక్కువగా పడుతుందని రేషన్‌ డీలర్ల సంఘాల నేతలు భావిస్తున్నారు. జిల్లాలో హడావిడి ఎక్కువుగా ఉండటంతో డీలర్లంతా కలిసి బల్క్‌గా ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన ఉచిత బియ్యం బ్యానర్లకు ఆర్డర్‌ పెట్టారు. ఇవి రేషన్‌ డీలర్లకు చేరాయి. వారం రోజుల్లో ఈ బ్యానర్లను తమ డిపోల దగ్గర డీలర్లు ప్రదర్శించనున్నారు...
 

Follow Us:
Download App:
  • android
  • ios