పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న పక్షం రోజుల ర్వాత తీరిగ్గా నరేంద్రమోడి ఇపుడు తన నిర్ణయంపై ప్రజాభిప్రాయాన్ని కోరటం విశేషం.
పిచ్చితుగ్లక్ కూడా సిగ్గుపడతాడేమో మోడి చర్యలు చూస్తే. ఎవరైనా నిర్ణయం తీసుకునేముందు అభిప్రాయాలు కోరుతారు. మరి నిర్ణయం తీసేసుకుని, తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చేసిన తర్వాత తీరిగ్గా ఎవరైనా అభిప్రాయాలను కోరుతురా ? మోడి కోరారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న పక్షం రోజుల ర్వాత తీరిగ్గా నరేంద్రమోడి ఇపుడు తన నిర్ణయంపై ప్రజాభిప్రాయాన్ని కోరటం విశేషం.
నమో యాప్ ద్వారా దేశ ప్రజలు పెద్ద నోట్ల రద్దుపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. ప్రజాభిప్రాయాన్ని తాను తెలుసుకోదలచినట్లుగా మోడి దేశప్రజలకు చెప్పారు. ఏకపక్షంగా పెద్ద నోట్లను రద్దుచేసి తీరిగ్గా రెఫరెండం కోరటం బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా జరిగి ఉండదు. ఏకపక్షంగా పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధానమంత్రి ఒకవేళ పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రజాతీర్పు వస్తే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారా? లేక ప్రధానమంత్రి పదివికే రాజీనామా చేస్తారా? అన్నది ఇపుడు ఆశక్తిగా మారింది.
అదేసందర్భంలో పెద్ద నోట్లను రద్దు చేసిన కారణాన్ని ఇపుడు మోడి పార్టీ ఎంపిలకు వివరిస్తున్నారు. అయితే, ప్రధాని వాదనతో పలువురు ఎంపిలు విభేదించినట్లు సమాచారం. ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తమ అభిప్రాయాలను ఎంపిలు నేరుగా మొడితోనే కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా ప్రజాగ్రహాన్ని గమనించిన ప్రధానికి సమస్య నుండి ఏ విధంగా బయటపడాలో మాత్రం అర్ధం కావటం లేదు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఉపసంహరించుకుంటే ప్రభుత్వంతో పాటు పార్టీ పరువు కూడా గంగలో కలిసినట్లే. ఆ విషయమే ఇపుడు మోడికి మనశ్శాంతి లేకుండా చేస్తోంది.
ప్రజల స్పందన చూస్తున్న ఎన్డిఏ మిత్రపక్షాలు కూడా నోట్ల రద్దు విషయంలో మోడిని వెనకేసుకురాలేక పోతున్నాయి. ఆ విషయం ఉభయ సభల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. అన్నీ వైపుల నుండి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకునేందుకే చివరకు ప్రధానమంత్రి రెఫరెండం అనే కొత్త విధానానికి తెరలేపినట్లు కనిపిస్తోంది.
