న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుందంటూ ఆందోళనకు దిగిన తెలుగుదేశం పార్లమెంటు సభ్యులపై కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ మండిపడ్డారు. టీడీపి ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని ఆయన సోమవారం అన్నారు. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 

తెలంగాణలో ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎదురు దెబ్బ తగులుతుందని పియూష్ గోయెల్ అన్నారు. ఎపిలో దుష్ట కూటమిని కట్టేందుకు టీడీపి ప్రయత్నిస్తోందని ఆయన విరుచుకుపడ్డారు.

ఎపికి కేంద్రం ప్యాకేజీని ప్రకటించినప్పుడు దాన్ని స్వాగతిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతోందని అన్నారు.  ప్యాకేజీ ద్వారా ఎక్కువ లాభం వస్తుందని అప్పుడు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ఇదిలావుంటే, టీడీపి ఎంపిలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. కేంద్రం తీరును ఎండగట్టడానికి రోజుకో వేషధారణలో కనిపిస్తున్న టీడీపి ఎంపీ శివప్రసాద్ సోమవారంనాడు ఎంజీఆర్ వేషధారణలో కనిపించారు. కేంద్రం ఎపికి అన్యాయం చేస్తుందని ఆయన విమర్శలు గుప్పించారు.