ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలుపై చర్యలు కోరుతూ పిటిషన్.. హైకోర్టులో విచారణ..
ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సంజయ్, ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సంజయ్, ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సత్యనారాయణ ఈ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దర్యాప్తులో ఉండగా ప్రజాధనం దుర్వినియోగం చేసి సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ సుధాక్ రెడ్డిలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో మీడియా సమావేశాలు పెట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని.. అయితే ఎంతమేర ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని తెలిపారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరగగా.. కేసులో చార్జి షీట్ దాఖలు చేయకుండా, విచారణ ముగియక ముందే ఇలా చేయటం ద్వారా ప్రజా ధనం వృధా అయిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ప్రజాధనం ఎంత వృధా అయిందో వివరాలు తెలపాలని న్యాయస్థానం కోరింది. కోర్టు అనుమతితో మరోమారు ఆర్టీఐ ద్వారా వివరాల కోసం దరఖాస్తు చేయాలని హైకోర్టు సూచిస్తూ.. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.