ఏపీ కేబినెట్ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో అధికార వైసీపీలో చోటు చేసుకున్న అసమ్మతి సెగలకు ఫుల్ స్టాప్ పెట్టింది అధిష్టానం ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరిత, సామినేని ఉదయభానులు కాస్త మెత్తబడినట్లుగా తెలుస్తోంది.
వైసీపీలో (Ysrcp) మంత్రి పదవి ఆశావహుల అసంతృప్తి టీ కప్పులో తుఫాను చందంగా మారింది. పదవులు రాలేదని అలిగి ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కొరిగా దిగొస్తున్నారు. బాలినేని (balineni srinivas reddy) ఎపిసోడ్‌కి శుభం కార్డ్ వేసిన అధిష్టానం.. ఇవాళ పిన్నెల్లి (pinnelli ramakrishna reddy) , సుచరిత (mekathoti sucharitha) , ఉదయభానులను (samineni udaya bhanu) బెజవాడ పిలిపించింది. పిన్నెల్లితో పెద్దిరెడ్డి.. ఉదయభాను, సుచరితతో మోపిదేవి వెంకట రమణ జరిపిన చర్చలు సఫలమైనట్లుగా కథనాలు వస్తున్నాయి. దీంతో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కాసేపట్లో సీఎం జగన్‌ను కలవనున్నారు. ఈ నేపథ్యంలో వీరికి పార్టీ పరంగా బాధ్యతలు, ప్రోటోకాల్‌తో కూడిన పదవులను అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు తనను మంత్రివర్గంలో కొనసాగించలేదంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సుచరిత కూడా వెనక్కి తగ్గారు. కాసేపట్లో ఆమె కూడా సీఎం జగన్‌తో సమావేశం కానున్నారు. అలాగే జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా మెత్తబడ్డారు. ఆయన కూడా మధ్యాహ్నం 3 గంటలకు సీఎంతో సమావేశం కానున్నారు. వీరిద్దరితో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ చర్చలు జరిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్ధీకరించిన (ap cabinet reshuffle) సంగతి తెలిసిందే .11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించడంతో పాటు 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు . అయితే మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు అసమ్మతి గళం విన్పిస్తున్నారు. రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు. అటు వీరికి మద్ధతుగా అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో రెండు రోజులుగా రాష్ట్ర రాజకీయాలు గరం గరంగా వున్నాయి.
