అమరావతి:  వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కు నగదు బదిలీ పథకం విషయంలో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయంలో విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ప్రభుత్వం తిప్పికొడుతోంది. తొలుత శ్రీకాకుళం జిల్లాలో ఈ స్కీమ్ ను పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని సర్కార్ తలపెట్టింది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల్లో భాగంగా వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ కు నగదు బదిలీని ఏపీ సర్కార్ అమలు చేస్తోంది. ప్రతి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కు మీటర్ ను బిగించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 30 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.ప్రతి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లను బిగించనున్నారు. 

అక్రమంగా ఉన్న విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం క్రమబద్దీకరించనుంది. నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు అవసరమైన ఫీడర్లు, విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయనుంది. పగటిపూట 9 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ ను సరఫరా చేసేందుకు గాను అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. 

also read:రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా: మీటర్లు బిగించనున్న ఏపీ సర్కార్

9 గంటల పాటు ఎంత విద్యుత్ వినియోగించినా ఉచితమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.విద్యుత్ మీటర్లను ప్రభుత్వం బిగించనుంది. విద్యుత్ మీటర్ల రీడింగ్ ను ప్రభుత్వం చూడనుంది. రైతుల కోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెరుస్తారు. దీనిపై బ్యాంకులు, విద్యుత్ అధికారుల మద్య ఒప్పందం జరుగుతుంది. రాష్ట్రంలో సుమారు 17 లక్షల ఉచిత విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అనధికారికంగా కనెక్షన్లు లక్ష వరకు ఉంటాయని ప్రభుత్వం అభిప్రాయంతో ఉంది. 

ప్రత్యేక కార్పోరేషన్ ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చిన  తర్వాత మరింత చౌకగా ఉచిత విద్యుత్ ను అందించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. డిసెంబర్ నుండి శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఏప్రిల్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్ కు నగదు బదిలీని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది.

వచ్చే రబీ సీజన్ నాటికి ప్రత్యేకమైన విద్యుత్ ఫీడర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం తలపెట్టింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగిస్తే విద్యుత్ సంస్థలకు వచ్చే నష్టాలు కూడ తగ్గుతాయని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.