అమరావతి:ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లను బిగించాలని రాష్ట్ర ప్రభుత్వం బిగించనుంది. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004లో  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ ను అమల్లోకి తీసుకొచ్చాడు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత  ఉచిత విద్యుత్ ఫైల్ పై వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంతకం చేశారు. 

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడ ఈ పథకాన్ని కొనసాగిస్తున్నాయి.  రాష్ట్ర విభజన తర్వాత కూడ రెండు రాష్ట్రాలు కూడ ఇదే స్కీమ్ ను అమలు చేస్తున్నాయి.

తాజాగా ఏపీ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో కీలక మార్పులు చేసింది. మీటర్లను బిగించి మీటర్ రీడింగ్ ప్రకారంగా డబ్బులు వసూలు చేయనున్నారు. రైతులు వినియోగించిన విద్యుత్ ఆధారంగా రైతులు విద్యుత్ బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది. 

ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.8400 కోట్లను ఖర్చు చేస్తోంది.  రాష్ట్రంలో 18 లక్షల వ్యవసాయ వినియోగదారులున్నారు. 30 ఏళ్ల పాటు రైతాంగానికి ఉచిత విద్యుత్ సరఫరా చేయడానికి ఈ మార్పులు చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది.

రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కార్యాచరణకు ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. రూ. 1700 కోట్లతో పగటిపూట 9 గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ను సరఫరా చేసేందుకు వీలుగా సబ్ స్టేషన్లను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది.

రైతులకు ఉచిత విద్యుత్ సబ్సీడీని ప్రతి నెల బ్యాంకు ద్వారా చెల్లించనున్నారు. 2021-2022 ఆర్ధిక సంవత్సరం నుండే రైతుల ఖాతాల్లోకి విద్యుత్ నగదు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది.