పందుల పెంపకంపైనే ఆదాారపడి జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి అతి దారుణంగా హత్యకు గురయిన ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలో చోటుచేసుకుంది. 

గుంటూరు: పందులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి అతి దారుణంగాా హత్యకు గురయిన విషాద ఘటన చిలకలూరిపేట పరిధిలో చోటుచేసుకుంది. అతడిని అతి కిరాతకంగా హతమార్చి మృతదేహాన్ని కొంతదూరం ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిన దుండగులు మురుగుకాలువ పక్కన పడేసారు. ఇలా మంగళవారం రాత్రి నుండి కనిపించకుండా పోయిన వ్యక్తి బుధవారం తెల్లవారేసరికి శవమై కనిపించాడు.

పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిలకలూరిపేట పట్టణంలోని రూత్ డైక్ మెన్ కాలనీకి చెందిన ప్రతాప్ కిల్లయ్య (35) పందుల పెంపకాన్నే జీవనాధారంగా మార్చుకున్నాడు. పందులను మేపుకుంటూ వాటి అమ్మకంద్వారా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. రోజూ ఉదయం పందులను మేపడానికి బయటకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగివచ్చేవాడు.

ఇలా ప్రతిరోజు మాదిరిగానే మంగళవారం ఉదయం కూడా పందులు మేపడానికి కిల్లయ్య బయటకు వెళ్లాడు. కానీ రాత్రయినా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కంగారుపడిపోయిన కుటుంంబసభ్యులు అతడి కోసం చుట్టుపక్కలంతా వెతికినా ఫలితం లేకుండా పోయింది. 

అయితే ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున పందులను ఉంచే ప్రాంతంలో కుటుంబసభ్యులు గాలించగా ఓ మురికికాలువ పక్కన కిల్లయ్య మృతదేహం లభించింది. దీంతో వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కిల్లయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

ఘటనాస్ధలాన్ని పరిశీలించిన పోలీసులు కిల్లయ్యను హత్యచేసి కొంతదూరం లాక్కొచ్చి నాదెండ్ల మండలం గణపవరం శివ ప్రియనగర్ లోని మురుగుకాలువ పక్కన పడేసినట్లు భావిస్తున్నారు. కిల్లయ్య శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

ఈ దారుణ హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరిపై అయినా అనుమానం వుందేమోనని కిల్లయ్య భార్య, కుటుంబసభ్యుల నుండి వివరాలను సేకరిస్తున్నారు. త్వరలోనే కిల్లయ్యను హతమార్చిన నిందితులను పట్టకుంటామని పోలీసులు తెలిపారు.

 కిల్లయ్య దారుణ హత్య భార్య, ముగ్గురు పిల్లలను రోడ్డున పడేసింది. కుటుంబ పెద్దను కోల్పోయిన వీరు బోరున విలపిస్తున్నారు. వీరిని ఓదార్చడం ఎవరివల్ల కావడం లేదు. కిల్లయ్య హత్యతో చిలకలూరిపేటలోనూ విషాదం నెలకొంది. 

ఇదిలావుంటే విశాఖ ఏజెన్సీ‌ ప్రాంతంలో పాతకక్షలకు ఓ వ్యక్తి బలయ్యాడు. చింతపల్లిలో భార్య కళ్ళ ఎదుటే భర్తను ప్రత్యర్ధులు నాటు తుపాకీతో కాల్చి అనంతరం కత్తితో పొడిచి దారుణంగా చంపారు కిటుముల పంచాయతీ పరిధిలోని బూసిబంద గ్రామ శివారులో ఈ దారుణం చోటు చేసుకుంది. 

బూసిబంద గ్రామానికి చెందిన పాంగి సుమంత్(50) తన భార్య రస్సు‌తో కలిసి ఓ శుభకార్యం కోసం పెదబయలులోని బంధువుల ఇంటికి వెళ్లారు. వేడుక ముగిసిన అనంతరం సాయంత్రం ఐదు గంటల సమయంలో తన స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ సంగతి తెలుసుకున్న సమీప బంధువులు సుమంత్‌ పై దాడి చేశారు.

 ఊరికి దగ్గరలోని కొండ దిగుతున్న క్రమంలో సుమంత్ కు వరుసకు బామ్మర్థులైన బచ్చేలవెనం గ్రామానికి చెందిన సిందేరి పెంటయ్య, నాగేశ్వరరావులు మాటువేసి నాటు తుపాకితో కాల్చి, అనంతరం కత్తితో దాడిచేసారు. దీంతో భార్య కళ్లముందే సుమంత్ విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ.హత్య అనంతరం నిందితులు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు.