జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆమంచి సోదరుడి ఫొటో ఉండడం ఇప్పుడు బాపట్లలో చర్చనీయాంశంగా మారింది.
బాపట్ల : ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ, జనసేన, టిడిపిల మధ్య రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇటీవలే వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపి నుంచి పోటీ చేయాలనే ఉంది అంటూ ఆల్రెడీ నడుస్తున్న వివాదానికి మరింత కాంట్రావర్సీని జోడించారు. ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గ వైసీపీ బాధ్యుడుగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు ఫోటో జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ మీద ఉండడం చర్చనీయాంశంగా మారింది.
చీరాలలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్ళపల్లిలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తూ చర్చనీయాంశంగా మారింది. ఈ ఫ్లెక్సీ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములు ఫోటోలను కూడా ముద్రించారు.
చీరాల మాజీ శాసనస శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడే ఆమంచి శ్రీనివాసరావు. అంతేకాదు ఇటీవలే ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు నియోజకవర్గానికి వైసీపీ బాధ్యుడిగా బాధ్యతలు కూడా స్వీకరించారు. ఈ నేపథ్యంలో చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున అతని సోదరుని ఫోటో కూడా ఫ్లెక్సీలో ఉండడంతో.. ఆమంచి శ్రీనివాసరావు జనసేనలోకి మారతారా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో అన్నదమ్ముల మధ్య పోటీ నెలకొంటుందా? రాజకీయం ఏ విధంగా ఉండబోతోంది? అని స్థానికులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఒక ఫ్లెక్సీ తో రాజకీయ వర్గాల్లో అనేక ఆలోచనలు రేకెత్తాయి.
ఈ ఫ్లెక్సీ బాపట్ల జిల్లా చీరాల హైవేపై వెలిసింది. ఆమంచి స్వాములు గత రెండేళ్లుగా పర్చూరు వైసీపీ సీటు కోసం ఆశిస్తున్నారు. అయితే ఇటీవల జగన్ పర్చూరు బాధ్యతలను ఆమంచి కృష్ణమోహన్ కు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు వెలియడం చర్చనీయాంశంగా మారాయి.
