పెథాయ్ తుఫాను సోమవారం తీరం దాటినప్పటికీ... మరో 24గంటల పాటు తుఫాను ప్రభావం ఉంటుందంటున్నారు మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు. విజయనగరం జిల్లాలో మరో 24గంటల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. అందుకే అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు ముమ్మరం చేయాలని ఆయన సూచించారు.

తుఫాను నేపథ్యంలో జిల్లా అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నష్ట నివారణ చర్యలపై సూచనలు చేశారు. పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో సహాయ పునరావాస ఏర్పాట్లు సక్రమంగా చేపట్టాలని సూచించారు. ఆస్పత్రుల్లో అన్నిరకాల మందులు అందుబాటులో ఉండాలని చెప్పారు. జిల్లాలో నమోదైన వర్షపాతం, తుఫాను నష్టం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రైతులు, మత్స్యకారులకు జరిగిన నష్టంపై అంచనా వేయాలని సూచించారు. ప్రజలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ప్రజలకు సహాయసహకారాలు అందించాలని సూచించారు.