మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్‌ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో హత్యకు ముందు జరిగిన వ్యవహారాలపై పోలీసులు దృష్టి పెడుతున్నారు.

ఘటన జరిగిన అర్థరాత్రి నుంచి ఆ తర్వాతి రోజు సాయంత్రం వరకు జరిగిన పరిణామాలను ఒక క్రమంలో పెట్టి ఒక అంచనాకు వస్తున్నారు. మరోవైపు వివేకా హత్యకు ముందు ఆయనకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క కూడా అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లుగా పోలీసులు గుర్తించారు.

వివేకా హత్యకు సరిగ్గా వారం ముందు ఆయన సెల్‌ఫోన్‌కు ‘‘ బీ కేర్ ఫుల్’’ అంటూ ఓ ఆజ్ఞాత వ్యక్తి మెసేజ్ పంపాడు. దానిని ఎవరు పంపారు.? ఎందుకు పంపారు.? అన్న విషయంపై సిట్ ఆరా తీస్తోంది.

కాగా హత్య జరిగిన తర్వాతి రోజు నుంచి వివేకా అనుచరులు గంగిరెడ్డి, పరమేశ్వరరెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. బెంగళూరులోని ఓ భూవివాదంలో వివేకాకు గంగిరెడ్డికి మధ్య గొడవ జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

దాదాపు రూ.125 కోట్ల విలువైన సెటిల్‌మెంట్ వ్యవహారంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఈ డీల్‌లో రూ.1.5 కోట్ల లావాదేవీలపై సిట్ కూపీ లాగుతోంది. గంగిరెడ్డితో పరమేశ్వర్ రెడ్డి చేతులు కలిపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

హత్యకు 15 రోజుల ముందే ఆయన కార్యక్రమాలు, దినచర్యపై రెక్కీ నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న వివేకా ప్రధాన అనుచరుడు పరమేశ్వర్ రెడ్డిని సోమవారం రాత్రి తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివేకా హత్య తర్వాత అతను పులివెందుల నుంచి పరారై కడపలోని ఓ ఆసుపత్రిలో మూడు రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు.