టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి పేర్నినాని విరుచుకుపడ్డారు. బాబు హత్యా రాజకీయాలతో పైకి ఎదిగిన వ్యక్తని,  ఆయన కొడుకు హత్యారాజకీయాల గురించి ట్వీట్‌లు చేయడం హాస్యాస్పదంగా ఉందని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ప్రొద్దుటూరు సుబ్బయ్య మృతిపై విచారణ జరుగుతుందని, చనిపోయిన వారి గురించి మాట్లాడటం సబబు కాదని అన్నారు. 

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ టీడీపీ వాళ్లలా మేము మాట్లాడలేము. సుబ్బయ్యపై 2002 నుంచి 14 కేసులు ఉన్నాయి. టీడీపీ హయాంలోనే ఆయనకు రెండు కేసుల్లో శిక్ష పడింది. ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించి ఈ రోజు సుబ్బయ్యను పొట్టన పెట్టుకుంది టీడీపీనే అని మండిపడ్డారు పేర్నినాని.

అంతేకాదు, తన తండ్రిని హత్య చేస్తేనే వదిలేసిన చరిత్ర వైఎస్సార్ కుటుంబానిది. రాయలసీమలో ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించింది చంద్రబాబే. లోకేష్ ఈ మధ్య కొవ్వు తగ్గించుకున్నాడు, ఇప్పుడు మదం కూడా తగ్గించుకోవాలి. ఎవరో రాసిస్తే ట్వీట్ చేయడం కాదు.. వాస్తవాలు తెలుసుకో లోకేష్ బాబు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.