ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి సమర్పించిన రిపోర్ట్‌లో.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికార వైసీపీతో పొత్తుపెట్టుకోవాలని ఓ ప్రతిపాదన చేశారు. అయితే ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే రాజకీయ వేడి కనిపిస్తుంది. ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి సమర్పించిన రిపోర్ట్‌లో.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికార వైసీపీతో పొత్తుపెట్టుకోవాలని ఓ ప్రతిపాదన చేశారు. అయితే ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వచ్చే కాంగ్రెస్, వైసీపీ పొత్తు పెట్టుకుంటాయా..? లేదా..? అనే చర్చ సాగుతుంది. అయితే దీనిపై వైసీపీ ముఖ్యుల నుంచి మాత్రం ఎటువంటి ఖండన రాలేదు. అయితే వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీకి వైసీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం జగన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు.
అయితే ఇదే అంశంపై మంత్రి గుడివాడ అమర్నాథ్.. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు పుట్టిందే వైసీపీ అన్నారు. వ్యూహకర్తలు సలహాలు ఇస్తారు.. కానీ అమలు చేయాలో లేదో నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం నాయకుడే అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని వైఎస్ జగన్ ఎదురించి నిలబడ్డారని.. అలాంటిది కాంగ్రెస్‌తో పొత్తా.. నవ్విపోతారంటూ ఎద్దేవా చేశారు.
తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. విజయసాయిరెడ్డి మాదిరిగానే వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాగితంపై రాసి ఇచ్చే ఏ పార్టీతోనైనా పొత్తుకు తాము సిద్ధమని అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. పొత్తులు అవసరం లేదని చెశారు. ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ఎవరికైనా మద్దతు ఇస్తామని చెప్పారు. ‘‘ఎన్నికల తర్వాత కేంద్రంలో మా ఎంపీల అవసరం అనుకునే ఏ కూటమికైనా సరే మద్దతు తెలుపుతాం. కానీ ముందుగా ఆ కూటమి ఏపీ ప్రత్యేక హోదా ఇస్తామని కాగితం మీద రాసిస్తేనే మా మద్దతు ఉంటుంది’’ అని పేర్ని నాని చెప్పారు.
కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేలా ప్రశాంత్ కిషోర్ వైసీపీకి దిశా నిర్దేశం చేస్తున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. వైసీపీని ఎవరూ శాసించలేరని చెప్పారు. పీకే తమ పార్టీకి కన్సల్టెంట్ అని.. ఎన్నికల్లో ఆయన ఆలోచనలు వాడుకుంటామని తెలిపారు. పార్టీ తనకు కృష్ణా జిల్లా బాధ్యతలు అప్పగించిందని.. 2024 ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేల గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని పేర్ని నాని తెలిపారు. వచ్చే నెల 2 నుంచి ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని వివరిస్తామన్నారు.
ఇక, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ బానిస అని విమర్శించారు. పవన్ కల్యాణ్.. చంద్రబాబుపై చూపిస్తున్న ప్రేమ చిరంజీవి పట్ల చూపిస్తే బాగుండేదన్నారు. చిరంజీవికి, పవవ్‌కు చాలా వ్యత్యాసం ఉందన్నారు. చిరంజీవి విలువలున్న వ్యక్తి అని అన్నారు. చంద్రబాబు సీఎం కావాలని పవన్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
