Mekapati Goutham Reddy death : నిన్నటివరకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకే కృషి..పెద్దిరెడ్డి దిగ్భ్రాంతి
ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హాఠాన్మరణం అందరినీ తీవ్రంగా కలిచివేసింది. నిన్నటివరకు ఆయన రాష్ట్రం కోసమే పనిచేశారంటూ మంత్రి పెద్దిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు.
విజయవాడ : మంత్రి Mekapati Gautam Reddy హఠాత్మరణం పట్ల మంత్రి Peddireddy Ramachandrareddy దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే గౌతమ్ రెడ్డి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ... మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త బాధించింది. చిన్న వయస్సులోనే ఆయన మనల్ని వదిలి వెళ్ళడం బాధాకరం అన్నారు. మంత్రిగా చాలా చురుగ్గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. నిన్నటి వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారని.. ఆయన అధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ పెట్టుబడి రంగం అభివృద్ధి సాధించిందన్నారు. మేకపాటి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.గౌతమ్ రెడ్డి మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం గురించి తెలుసుకొన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు.గౌతమ్ రెడ్డి మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఓ మంచి స్నేహితుడు.. అన్నను కోల్పోయానంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మేకపాటి గౌతమ్‌రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయవేత్త. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుండి 2014 సార్వత్రిక ఎన్నికలలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యునిగా గెలుపొందారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి వీరి సొంత గ్రామం, ఈ గ్రామం ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం కిందికే వస్తుంది. మేకపాటి గౌతమ్‌రెడ్డి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. మేకపాటి వయస్సు 49 సంవత్సరాలు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 1994-1997లో మాంచెస్టర్ యుకెలో సైన్స్ అండ్ టెక్నాలజీ మాంచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ విశ్వవిద్యాలయం (UMIST) నుండి M.Sc పట్టాను పొందారు.
డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆత్మీయున్ని కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మీయుడు, మంచి సహచరుడు, సమర్ధుడైన నాయకుడు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తనను తీవ్రంగా కలచి వేస్తోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. దశాబ్దాలుగా మేకపాటి కుటుంబంతో ఉన్న అనుబంధం ఎన్నటికీ మరువలేనిదని, గౌతమ్ రెడ్డి లాంటి యువ నాయకుడు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు.
తమ సహచరుల్లో ముఖ్యమంత్రి జగన్ కు ఎంతో ఇష్టమైన, సన్నిహితుడైన గౌతమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక, నైపుణ్యభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి విశేషంగా పెట్టుబడులు, మంచి పేరు ప్రఖ్యాతులు, అవార్డులు తీసుకు రావడం వెనక ఆయన విశేషమైన కృషి దాగి ఉందని గుర్తు చేశారు. గౌతమ్ రెడ్డి లేని లోటు ఎవరూ తీర్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని కృష్ణదాస్ వ్యక్తం చేశారు.
గౌతమ్ రెడ్డి మృతి వైస్సార్ పార్టీ కి తీరని లోటు - మంత్రి వెలంపల్లి
పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి నా సహచరులు మరణం నన్ను కలచివేస్తుందని దేవాదాయ శాఖ మంత్రీ వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. గౌతమ్ రెడ్డి లాంటి యువ నాయకుడు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు ఎంతో , సన్నిహితుడైన గౌతమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక, నైపుణ్యభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి విశేషంగా పెట్టుబడులు, మంచి పేరు ప్రఖ్యాతులు, అవార్డులు తీసుకు రావడానికి విశేషమైన కృషి చేశారన్నారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.