అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ తండ్రీ కొడుకులిద్దరూ చాలా కష్టపడ్డారు. రాయలసీమలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో వారి పాత్ర కీలకమనే చెప్పాలి. తనయుడు పార్టీ అధినేత వైయస్ జగన్ కు వెన్నంటి ఉంటూ వ్యూహాలు రచిస్తే తండ్రి రాయలసీమలోనే ఉంటూ చక్రం తిప్పారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా చకచకా జరిగిపోయాయి. ఇకపోతే ఏపీ కేబినెట్ పై అసలు చర్చ  జరుగుతోంది. 

రాయలసీమకు పెద్ద దిక్కుగా వ్యవహరించిన పెద్దాయనకు హోంశాఖ మంత్రి కన్ఫమ్ అని ప్రచారం జరుగుతుంది. ఇంతలో ఆయన తనయుడుకి పార్టీ అధినేత వైయస్ జగన్ పెద్ద పదవి ఇచ్చారు. ఏకంగా లోక్ సభాపక్ష నేతగా అవకాశం ఇచ్చారు. తనయుడుకి కీలక పదవి దక్కడంతో ఆ పెద్దాయన పుత్రోత్సాహంతో ఉన్నారట. 

అయితే తనయుడుకి కీలక పదవి కట్టబెట్టడం తన పదవికి ఎసరు వస్తుందేమోనని ఆ తండ్రి ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. తనకు మంత్రి పదవి వస్తుందని భావిస్తున్న తరుణంలో జగన్ తనయుడుకి కీలక పదవి ఇవ్వడం చూస్తుంటే తనకు పదవి కష్టమేనా అన్న సందేహం నెలకొందట ఆ పెద్దాయనలో. 

ఇంతకీ ఆ పెద్దాయన ఎవరు, ఆ తనయుడు ఎవరు అని అనుకుంటున్నారా ఇంకెవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తనయుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. 

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరులో ఉంటూ రాయలసీమ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతుంది. చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించారు. 

ఇకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇలాకాలో కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తన మెజారిటీ తగ్గడంపై చంద్రబాబు నాయుడు చేస్తున్న గగ్గోలుకు కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని టాక్. పెద్దిరెడ్డి వ్యూహం కారణంగానే 70 వేల మెజారిటీ అనేది కేవలం 30 వేలకు పడిపోయిందని రాయలసీమ అంతా కోడై కూస్తోంది. 

ఇకపోతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏపీ సీఎం వైయస్  జగన్మోహన్ రెడ్డి వెన్నంటి ఉండేవారు. అలాగే పార్టీలో చేరికలు, ఫిరాయింపులపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ చక్రం తిప్పారు. అనంతపురం జిల్లాలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో చక్రం తిప్పారని ప్రచారం. 

ఇదిలా ఉంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకానొక సందర్భంలో ఆర్థికంగా అండగా ఉన్నది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబమేనని ఇప్పటికీ పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ కేబినెట్ లో కీలక పదవి దక్కడం ఖాయమని ప్రచారం జరిగింది.

ఒకానొక దశలో రాష్ట్ర హోం శాఖ మంత్రి అంటూ కూడా ప్రచారం జరిగిపోయింది. జగన్ కేబినెట్ కూర్పుపై కసరత్తు చేస్తున్న తరుణంలో లోక్ సభ పదవులు ప్రకటించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని లోక్ సభాపక్ష నేతగా నియమిస్తూ కీలక పదవి కట్టబెట్టారు. 

అయితే తనయుడుకి కీలక పదవి కట్టబెట్టడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి వర్గంలో చోటుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే ఇంట్లో రెండు కీలక పదవులు ఇచ్చే అవకాశం ఉండదని ప్రచారం జరుగుతోంది. కొడుకు పదవి తండ్రికి అడ్డొచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానిది కీలక పాత్ర అని ఆయన సేవలను గుర్తించి ఖచ్చితంగా జగన్ మంత్రి పదవి ఇస్తారని మరోప్రచారం జరుగుతుంది. 

దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడికి పెద్ద పదవి వరించిందని పుత్రోత్సాహంతో సంబరపడిపోవాలో లేక కొడుకు పదవి తన పదవికి అడ్డువచ్చే అవకాశం ఉందని బాధపడాలో అర్థంకాక తలపట్టుకుంటున్నారట. మెుత్తానికి ఈ అనుమానాలకు తెరదించాలంటే జగన్ కేబినెట్ విడుదల కావాల్సిందే మరి.