అమరావతి: గతంలో సగంలోనే నిలిపి వేసిన మండల, జిల్లాపరిషత్ ఎన్నికలకు న్యాయపరమైన అవాంతరాలతో పాటు అన్ని అడ్డంకులు తీరిన నేపథ్యంలో తక్షణం ఎస్‌ఇసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. సచివాలయంలోని పబ్లిసిటి సెల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాజాగా హైకోర్ట్ సైతం పరిషత్ ఎన్నికల వ్యాజ్యంపై తీర్పును వెలువరించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పందించాలని అన్నారు. 

తిరుపతి పార్లమెంట్‌ స్థానంకు ఉప ఎన్నిక ఏప్రిల్ 17న జరుగనున్న నేపథ్యంలో వైయస్‌ఆర్‌సిపి అత్యధిక మెజార్టీతో ఈ స్థానంలో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సిపి సాధించిన మెజార్టీలను పరిగణలోకి తీసుకుంటే తిరుపతి ఉప ఎన్నికల్లో దాదాపు మూడు లక్షలకు పైగా మెజార్టీని సాధిస్తామనే విశ్వాసం వుందని అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పట్ల ప్రజల్లో వున్న విశ్వసనీయతకు స్థానిక సంస్థల ఎన్నికలు అద్దం పట్టాయని అన్నారు. అదే స్పూర్తితో తిరుపతి ఉప ఎన్నికలోనూ మంచి మెజార్టీని ప్రజలు అందిస్తారని అన్నారు. 

ఎస్‌ఇసి వంటి సంస్థలకు నియంత్రణతో కూడిన అధికారాలు వుంటాయని పెద్దిరెడ్డి అన్నారు. పదవి వుందని ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదనే విషయం ఈ రోజు హైకోర్ట్ తీర్పు ద్వారా స్పష్టమవుతోందని అన్నారు. పరిషత్ ఎన్నికలు ఎక్కడ నిలిచిపోయాయో... అక్కడి నుంచే ప్రారంభించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఏకగ్రీవాలు అయిన చోట్ల పెండింగ్‌లో పెట్టిన డిక్లరేషన్ ఫాంలను కూడా ఇవ్వాలని కోర్టు చెప్పిందని అన్నారు. గతంలో ఎస్‌ఇసి కూడా సుప్రీంకోర్ట్‌లో వేసిన అఫిడవిట్‌లో ఎక్కడ నుంచి ఎన్నికలు నిలిపివేశామో అక్కడి నుంచే ప్రారంభిస్తామని చెప్పి మాట తప్పిందని అన్నారు ముందుగా జరపాల్సిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను పక్కకుపెట్టి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను జరిపిందని అన్నారు. తెలుగుదేశం పార్టీకి మేలు చేసేందుకు, వైయస్‌ఆర్సిపిని ఇబ్బంది పెట్టేలా ఎస్‌ఇసి వ్యవహారం చేసిందని అన్నారు 

ఈ రోజు హైకోర్ట్ తీర్పును దృష్టిలో పెట్టుకుని, నిలిచిపోయిన దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తే ఆరు రోజుల్లో మండల, జిల్లాపరిషత్ ఎన్నికలు పూర్తవుతాయని అన్నారు. ఎన్నికల కమిషనర్ తక్షణం ఈ ప్రక్రియను ప్రారంభించాలని కోరుతున్నామని అన్నారు. దేశమంతా కోవిడ్ వాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. రాష్ట్రంలో ఎన్నికల కారణంగా ఈ ప్రక్రియకు కొంత ఆటంకం ఏర్పడిందని అన్నారు. ఎస్‌ఇసి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే మండల, జిల్లాపరిషత్ ఎన్నికలను కూడా పూర్తి చేస్తే, ఆ తరువాత ప్రభుత్వం పూర్తిస్థాయిలో వాక్సినేషన్ ప్రక్రియపై దృష్టి సారించేందుకు వీలు పడుతుందని అభిప్రాయపడ్డారు. 

ఇద్దరు డిప్యూటీ మేయర్లు

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్‌లలో ప్రజలకు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు మరింత జవాబూదారీతనంతో  సేవలను అందించేందుకు ఇద్దరు చొప్పున వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఇప్పటి వరకు ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, అలాగే ఒక మేయర్, ఒక డిప్యూటీ మేయర్‌లు వుంటే, ఇకపై అదనంగా మరో వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్లు వుండేలా ఆర్డినెన్స్ తీసుకువస్తున్నామని చెప్పారు. 

ఈ నెల 18వ తేదీన యుఎల్‌బిసిల్లో చైర్మన్లు, మేయర్లు, వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోవాలని ఎస్‌ఇసి నోటిఫికేషన్ ఇచ్చిందని, దాని ప్రకారం ఎన్నిక జరుగుతుందని అన్నారు.  ఆర్డినెన్స్ తరువాత రెండో వైస్ చైర్మన్, రెండో డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకుంటారని చెప్పారు.  ప్రజలకు అందుబాటులో వుండి, మరింత సేవ చేసేందుకు గానూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎక్కువ అవకాశం కల్పించాలనే లక్ష్యంతో సీఎం వైయస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దీనివల్ల జవాబూదారీతనం కూడా పెరుగుతుందని అన్నారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి హిందుత్వ ఎజెండాతో పోటీకి సిద్దమవుతోందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ... ఈ రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా సీఎం వైయస్ జగన్ పాలన సాగుతోందని జవాబిచ్చారు. అన్ని మతాలకు సమానమైన గౌరవాన్ని అందిస్తూ పాలన సాగిస్తున్నారని చెప్పారు. అంతర్వేదిలో రథం దగ్ధమైతే మూడు నెలల్లో కొత్త రథాన్ని తయారు చేసి ఇచ్చామని గుర్తు చేశారు. విజయవాడలో చంద్రబాబు హయాంలో అరవైకి పైగా ఆలయాలను సుదంరీకరణ పేరుతో ద్వంసం చేశారని అన్నారు. చివరికి చెత్తబండిలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని తరలించిన ఘటనను కూడా రాష్ట్రప్రజలు చూశారని అన్నారు. 

చంద్రబాబు హయాంలో ద్వంసం చేసిన  ఆలయాలను తమ ప్రభుత్వం పునరుద్దరిస్తోంని పెద్దిరెడ్డి చెప్పారు. అందుకోసం అవసరమైన నిధులను కూడా సీఎంగారు మంజూరు చేశారు. అటువంటి తమ ప్రభుత్వంపై కులాలు, మతాల రంగును పులిమేందుకు నీచ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబుపై కక్ష లేదు 

చంద్రబాబుపై మాకు ఎటువంటి కక్షసాధింపు లేదని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పష్టం చేశారు. అమరావతి భూదందాలో జరిగిన అక్రమాలు, అవినీతిపై సిఐడి విచారిస్తోందని అన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విచారణలో భాగంగానే చంద్రబాబుకు సిఐడి నోటీసులు జారీ చేసిందని అన్నారు. ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతోందని అన్నారు. కానీ చంద్రబాబుకు గతంలో తాను సోనియాగాంధీతో కలిసి వైయస్ జగన్ ను ఏ రకంగా తప్పుడు కేసుల్లో ఇరికించి పదహారు నెలలు జైలుకు పంపాడో, అలాగే మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి పదహారు రోజులు ఎలా జైలుకు పంపాడో గుర్తుకు వస్తున్నట్లు ఉందని అన్నారు. తాను చేసినట్లే అందరూ చేస్తారని ఆయన అనుకుంటున్నారని అన్నారు. కానీ అమరావతి భూదందాలో అక్రమాలను బయటపెట్టేందుకే ఈ విచారణ జరుగుతోందని అన్నారు.