అమరావతి: ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అనంతపురం జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పయ్యావుల కేశవ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉరవకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 

ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇకపోతే స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పయ్యావుల కేశవ్ శాసన మండలిలో ప్రభుత్వ విప్ గా పనిచేశారు. ఇకపోతే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న కరణం బలరాం కూడా త్వరలో రాజీనామా చేసే అవకాశం ఉంది. 

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆయన కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 

వీరితోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిలు కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారు. మెుత్తం టీడీపీకి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నారు. 

మెుత్తం ఐదుగురు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంది. ఇకపోతే మే 23న ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయడంతో ప్రభుత్వ విప్ హోదాలతోపాటు మంత్రి మండలిని రద్దు చేస్తున్నట్లు సోమవారం సాయంత్రం సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శాసనమండలిలో ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న పయ్యావుల కేశవ్ హోదా కోల్పోయారు.