సమస్యలను స్పృసించటం ద్వారా ఓటు బ్యాంకును భారీగా సమకూర్చుకుంటున్నట్లు కనబడుతోంది.

మొత్తం మీద పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లే కనబడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ప్రకటించిన దగ్గర నుండి ఇప్పటి వరకూ పవన్ ప్రయాణాన్ని చూస్తుంటే స్ధిరమైన ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లే కనబడుతోంది. ఇప్పటి వరకూ పార్టీలు కానీ లేక నేతలు కానీ ఓటర్లను సామాజిక వర్గాలుగా విడదీసారు. అయితే, పవన్ మాత్రం వారి సమస్యలను స్పృసించటం ద్వారా ఓటు బ్యాంకును భారీగా సమకూర్చుకుంటున్నట్లు కనబడుతోంది.

సమాజంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను, బాధితులను నేరుగా పట్టించుకోవటం ద్వారా వారికి తానున్నానంటూ భరోసా ఇవ్వాలన్నది పవన్ తాపత్రయంగా కనబడుతోంది. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలోని ఉథ్థానం కిడ్నీ బాధితుల విషయమే తీసుకోండి. దశాబ్దాల తరబడి కిడ్నీ సమస్యకు ప్రత్యక్షంగా వేలాదిమంది బలైపోయారు. టిడిపి, కాంగ్రెస్ నుండి ఈ ప్రాంతంలో ఎందరో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించినా సమస్య పరిష్కారం కాలేదు. కొన్ని లక్షల మంది పరోక్ష బాధితులున్నారు. అందుకనే పవన్ నేరుగా వారి వద్దకే వెళ్లారు. దాంతో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించే పేరుతో హడావుడి చేసింది.

అదేవిధంగా, చేనేత కార్మికుల సమస్య. రాష్ట్రంలో చేనేతపై ఆధారపడ్డవారి సంఖ్య కొన్ని లక్షలు. ఎప్పడి నుండో తమ సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని వారు బాగా ఆగ్రహంగా ఉన్నారు. అటువంటిది పవన్ వారితో మాట్లాడి తాను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని స్వచ్చంధంగా ముందుకు వచ్చారు. వారి సమస్యలను విని ప్రభుత్వంతో మాట్లాడారు.

ఇక, తాజాగా అగ్రిగోల్డ్ బాధితులు. ఇక్కడ కూడా బాధితుల సంఖ్య దాదాపు 20 లక్షలు. సంవత్సరాల తరబడి వారి సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయింది. వీరి సమస్య పరిష్కారంలో ప్రభుత్వం చూపాల్సినంత శ్రద్ధ చూపలేదన్నది వాస్తవం. పైగా ఈ సమస్య న్యాయస్ధానంలో ఉంది. మరి, ఈ సమస్యపై పవన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇంతకు ముందోసారి అమరావతి ప్రాంతంలో కూడా తిరిగి రాజధాని రైతులతో కూడా మాట్లాడారనుకోండి. వారి సమస్య పరిష్కారం కోసం నిరాహారదీక్షకు సైతం దిగుతానని చెప్పినా ఏం కాలేదనుకోండి అది వేరే సంగతి.

మొత్తం మీద పవన్ వ్యూహం చూస్తుంటే ఒకవైపు ఉత్తరాంధ్రను కవర్ చేసారు. అదే సమయంలో చేనేత, అగ్రిగోల్డ్ సమస్యపై స్పందించటం ద్వారా మొత్తం రాష్ట్రాన్ని కవర్ చేసినట్లైంది. వివిధ సమస్యలపై స్పందించటం ద్వారా దాదాపు కోటి మంది బాధితులను నేరుగా టచ్ చేసినట్లైంది. అంటే, రేపటి ఎన్నికల్లో పవన్ గట్టి బేస్ ఏర్పాటుకు వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లు కనబడుతోంది.