సినీ విమర్శకుడు, పవన్ కల్యాణ్ పై తరచూ మాటలతో దండెత్తుతున్న కత్తి మహేష్ కు నిరసనగా పవన్ అభిమానికి ఒకరు హల్ చల్ చేశారు. మహేష్ వైఖరికి నిరసనగా సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ హడావుడే చేసారు. పవన్ పై కత్తి చేస్తున్న విమర్శలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అభిమానులు కుప్పలు తెప్పలుగా సెటైర్లు, కౌంటర్లు ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రుకు చెందిన ఓ యువకుడు విపరీత పోకడకు పోయాడు. పవన్‌కల్యాణ్‌పై కత్తి మహేష్ చేస్తున్న వ్యాఖ్యలకు మనస్తాపం చెందిన జ్యోతికృష్ణ ఏకంగా సెల్ టవర్ ఎక్కి చస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ‘సమాజంలో ఎన్నో సమస్యలుంటే కత్తిమహేష్ కేవలం పవన్ కళ్యాణ్ మీదే విమర్శలు చేయటం కేవలం దురుద్దేశ్యంతో చేస్తున్నవే’ అని అభిమాని మండిపడుతున్నాడు.

పవర్ స్టార్ పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న కత్తిమహేష్ పై పోలీసులు తక్షణమే చర్యతీసుకోవాలని జ్యోతికృష్ణ డిమాండ్ చేశాడు. మహేష్ కు నిరసనగా ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ టవర్ ఎక్కటంతో విషయం స్థానికంగా కలకలం సృష్టించింది. విషయం తెలీగానే అక్కడికి చేరుకున్న పవన్ అభిమానులు కత్తి మహేష్ కు విరుద్దంగా నినాదాలు చేశారు. దాదాపు నాలుగు గంటలపాటు సెల్ టవర్ మీద ఉన్న జ్యోతికృష్ణను ఎట్టకేలకు స్థానికులు, పోలీసులు సమదాయించడంతో కిందకి దింపారు. దాంతో కథ సుఖాంతమైంది.