పవన్ కల్యాణ్ ఏపి పర్యటన అనంతపురం జిల్లాతో రేపటి నుండి మొదలవుతోంది. ప్రజాయాత్రను తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాతో పవన్ తన రాజకీయ పర్యటన మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. శనివారం నుండి మూడు రోజుల పాటు అనంత జిల్లాలో బిజీగా గడపనున్నారు.  27 మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుంటున్న పవన్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేస్తారు. గుత్తిరోడ్డులో పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు.

మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకూ ప్రజావేదిక జరుగుతుంది. ఈ వేదికలో పాల్గొన్న వారితో ‘సీమ కరువుకు పరిష్కార మార్గాలు’ పై చర్చిస్తారు. గుత్తిరోడ్డులోని ఫంక్షన్ హాలులో సమావేశం జరుగుతుంది.  తర్వాత 28వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో కదిరి చేరుకుంటారు. నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసిన తర్వాత స్ధానికులతో సమావేశం ఉంటుంది.

అక్కడి నుండి పుట్టపర్తికి వెళతారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హనుమాన్ జంక్షన్లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. పుట్టపర్తిలోని సత్యసాయి మందిరాన్ని దర్శిస్తారు. తర్వాత మంచినీటి పథకం, ఆస్పత్రిని సందర్శిస్తారు. 29 ఉదయం 10 గంటలకు ధర్మవరానికి చేరుకుంటారు.  చేనేత కళాకారులతో సమావేశమవుతారు. మళ్ళీ అక్కడి నుండి హైదరాబాద్ కు చేరుకుంటారు.