రాష్టంలోని ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ నేతల్లో పలువురికి ఇబ్బందులు తప్పేట్లు లేవు.   జనసేన తాజాగా తీసుకున్న నిర్ణయంతో రెండు పార్టీల నేతలు, ప్రధానంగా కాపు సామాజిక వర్గంలోని వారికి నిజంగా పెద్ద షాకింగే.

రాష్టంలోని ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ నేతల్లో పలువురికి ఇబ్బందులు తప్పేట్లు లేవు. జనసేన తాజాగా తీసుకున్న నిర్ణయంతో రెండు పార్టీల నేతలు, ప్రధానంగా కాపు సామాజిక వర్గంలోని వారికి నిజంగా పెద్ద షాకింగే. వచ్చే ఎన్నికలు ఇటు టిడిపికైనా అటు వైసీపీకైనా ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకనే అధికారంలో కొనసాగాలని చంద్రబాబునాయుడు, ఎలాగైనా అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

అయితే, ఇక్కడే రెండు పార్టీల్లోని ఎంఎల్ఏలకు ఓ చిక్కు వచ్చిపడింది. వచ్చే ఎన్నికల్లో గెలుపును మాత్రమే లక్ష్యంగా టిక్కెట్ల ఎంపిక చేయాలని ఇద్దరు అధినేతలు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే, ఒక్కోసారి గెలవరని తెలిసినా, విధేయత, సీనియారిటీ, ఆర్దిక వనరులు, సామాజిక వర్గం తదితరాలను దృష్టిలో పెట్టుకుని టిక్కెట్లు ఇస్తుండటం మామూలే. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం గెలుపును మాత్రమే ప్రాతిపదికగా తీసుకోనున్నారు. అందుకనే ఇప్పటి నుండే ప్రతీ నియోజకవర్గంలోనూ ఒకటికి రెండు సార్లు సర్వేలు చేయించుకుంటున్నారు.

ఇటువంటి నేపధ్యంలోనే రెండు పార్టీల్లోనూ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కేది అనుమానమే అనుకున్న ఎంఎల్ఏలు, నేతలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అందులోనూ కాపు సామాజిక వర్గం నేతలు ప్రధానం. టిడిపిలో బోండా ఉమ, వైసీపీలో వంగవీటి రాధాల పేర్లు తరచచూ ప్రచారంలో నలుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ వచ్చే ఎన్నికల్లోపు జనసేన నుండి పోటీ చేస్తారని బాగా ప్రచారం జరుగుతోంది.

ఇటువంటి సమయంలో పవన్ తీసుకున్న ఓ నిర్ణయం కాపు సామాజికవర్గం నేతలకు ఒక్కసారిగా షాక్ కొట్టింది. వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున కొత్త వారికే టిక్కెట్లు ఇవ్వాలని పవన్ నిర్ణయించారట. పార్టీ ఉపాధ్యక్షుడు గురువారమే ప్రకటన చేసారు. పవన్ నిర్ణయం తీసుకోకుండా, ఆమోదం లేకుండా ప్రకటించే అవకాశం లేదు కదా? ఇతర పార్టీల నుండి జనేసేనలో చేరాలనుకుంటున్న వారికి ఎట్టి పరిస్ధితుల్లోనూ టిక్కెట్లు ఇవ్వకూడదనది పవన్ నిర్ణయమట. మూస రాజకీయాలకు స్వస్ది పలకాలంటే కఠిర నిర్ణయాలు తప్పవని కూడా పవన్ చెప్పారట. ఒకవేళ పవన్ తన తాజా నిర్ణయానికే కట్టుబడి ఉంటే టిడిపి, వైసీపీల నుండి జనసేన వైపు చూస్తున్న వారికి ఇబ్బందే. పవన్ నిర్ణయం ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాల్సిందే?