అమరావతి: జెడ్.పి.టి.సి.,ఎం.పి.టి.సి.ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ (ఎస్.ఇ.సి.) తీసుకున్న నిర్ణయంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఈసీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి నిరనసనగా  శుక్రవారం ఎస్.ఇ.సి. నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. 

రెండో తేదీన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు, ఆ సమావేశానికి రావలసిందిగా గురువారం సాయంత్రం ఆహ్వానాన్ని పంపిన ఎస్ఈసీ రాత్రి అయ్యేసరికి ఎన్నికలను పాత నోటిఫికేషన్ ప్రకారం కొనసాగిస్తామని,ఈ నెల 8 న పోలింగ్, 10 న ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించడం అప్రజాస్వామిక చర్యగా  జనసేన భావిస్తోందని ఆయన అన్నారు.

ఈ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన హై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు తీర్పు రాక ముందే ఎస్ఈసీ ఇటువంటి దురదృష్టకరమైన నిర్ణయం  తీసుకోవడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఈ తొందరపాటు నిర్ణయం అధికార పార్టీకి లబ్ది చేకూర్చడానికేనని జనసేన భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో నీలం సాహ్ని ఏపీ ఎస్ఈసీగా నియమితులయ్యారు. ఆమె ఏప్రిల్ 1వ తేదీన బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపడుతూ వచ్చారు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్ మీద హైకోర్టు విచారణ ముగించింది. తీర్పును రిజర్వ్ లో పెట్టింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడాన్ని పవన్ కల్యాణ్ తప్పు పడుతున్నారు.