పవన్ కల్యాణ్ తో దోస్తీ: చంద్రబాబుకు బిజెపి భారీ షాక్
ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో బిజెపి పొత్తు కుదుర్చుకుని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి భారీ షాక్ ఇచ్చింది.
ఆమరావతి: తాజా పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై దెబ్బ వేసింది. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి పనిచేస్తుందని భావించిన తరుణంలో ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. బిజెపి పెద్దల ఆహ్వానంతో ఢిల్లీ వెళ్లి పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకు షాక్ ఇచ్చింది.
మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే, అది శాసనసభ ఎన్నికల్లో కూడా కొనసాగి ఉండేది. కానీ, బిజెపి నేతలు ఊహించని రీతిలో స్పందించి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పవన్ కల్యాణ్ తమ నుంచి జారిపోకుండా జాగ్రత్త పడ్డారు.
Also Read: ఏపీలో మారుతున్న సమీకరణాలు: బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న పవన్
జనసేన విస్తృత స్థాయి సమావేశం ముగిసిన మరుక్షణమే హుటాహుటిన పవన్ కల్యాణ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆదివారం వరకు కూడా ఏ విధమైన కదలిక కనిపించలేదు. కానీ, అకస్మాత్తుగా సోమవారం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆర్ఎస్ఎస్ నేతలతో భేటీ అయిన పవన్ కల్యాణ్ బిజెపితో కలిసి అడుగులు వేయడానికి సిద్ధపడ్డారు. ఆ రకంగా బిజెపి టీడీపీకి భారీ షాక్ ఇచ్చింది.
వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్న బిజెపి మరో అడుగు ముందుకు వేసినా ఆశ్చర్యం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని ఎదుర్కోవడానికి టీడీపీతో కలిసి పనిచేసినా ఆశ్చర్యం లేదు.
నిజానికి, వచ్చే ఎన్నికలనాటికి టీడీపీ, జనసేన, బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసి పనిచేసే దిశగా పయనిస్తాయనే ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.