తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు.. అనారోగ్య కారణాల నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైద్య చికిత్స కోసం చంద్రబాబు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇక, ఈరోజు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబును పరామర్శించారు. పవన్ కల్యాణ్‌తో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ, ఏపీ రాజకీయ పరిణామాలపై కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏపీలో టీడీపీ, జనసేన సంయుక్తంగా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా ఇరువురు నేతలు చర్చలు జరిపినట్టుగా సమాచారం. అదే విధంగా చంద్రబాబుపై ఏపీ సీఐడీ నమోదు చేస్తున్న వరుస కేసులపై కూడా ఈ సందర్భంగా చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.
ఇక, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకున్న తర్వాత దాంతో ఆయన గురువారం ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం చంద్రబాబు శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం తన నివాసానికి వెళ్లిపోయారు. మరోవైపు చంద్రబాబు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటికి సంబంధించి ఆపరేషన్ చేయించుకోనున్నారు.
ఇదిలాఉంటే, రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు కలిసి పనిచేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కార్యచరణ రూపొందించేందుకు ఇరు పార్టీల నేతలు ఇప్పటికే ఒకసారి సమావేశం కూడా నిర్వహించాయి.
