ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆయన్ను ఎస్‌ఈసీగా కొనసాగించాలని ఆదేశించింది. నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పుతో జగన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలినట్లైంది. కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. 

కాగా.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేశారు. 

 

‘ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ ,ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది,అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసింది’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.

జగన్ సర్కార్ ఏపీ ఎస్ఈసీ పదవి కాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. దీనికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. తర్వాత రాష్ట్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపింది. వెంటనే రాష్ట్ర ఎన్నిక కమిషనర్ పదవికాలం మూడేళ్లు గడచిందని పేర్కొంటూ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. 

న్యాయ శాఖ జీవో 31, పంచాయతీరాజ్ శాఖ 617, 618 జీవోలు ఇచ్చాయి. దీంతో ఎస్‌ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదవిని నుంచి తొలగించారు. ఆ తర్వాత జస్టిస్ కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా నియమించారు.

ఆ వెంటనే నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా.. తాజాగా నిమ్మగడ్డకు మద్దుతుగా హైకోర్టు తీర్పు ఇవ్వడం గమనార్హం.