Pawan Kalyan: దూకుడు పెంచిన జనసేనాని.. ఉభయ గోదావరి జిల్లాల పర్య టన షెడ్యూల్ ఖరారు..
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దూకుడు పెంచారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే.. ప్రజాక్షేత్రంలో కాలుపెట్టనున్నారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్య టన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ పర్యటన కొనసాగనుంది. తొలిరోజు భీమవరంలో వివిధ సమావేశాలలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు
Pawan Kalyan: ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఏపీలో రాజకీయాలు వేడేక్కాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని తీవ్రంగా చర్చిస్తున్నాయి. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచాడు. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు సిద్దమయ్యారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.
భీమవరంలో తన పర్యటనను ప్రారంభించి అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరంలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పార్టీ సీనియర్ నేతలు, స్థానికంగా పలుకుబడి ఉన్న నేతలు, ఇతర ముఖ్యులతో ఆయన భేటీ కానున్నారు.
శనివారం విడుదల చేసిన జనసేన ప్రకటన ప్రకారం.. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ మిత్రపక్షమైన తెలుగుదేశం నాయకులతో కూడా సమావేశమవుతారు. రాజకీయ మైలేజీని పొందేందుకు సామరస్య సంబంధాన్ని పెంపొందించడానికి అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయిలో నాయకులు , క్యాడర్‌తో సమస్యలపై చర్చిస్తారు. పొత్తులో టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తోంది.
జనసేన అధినేత పర్యటన కార్యక్రమం మూడు దశల్లో నిర్వహించబడుతుంది. మొదటి దశలో.. ముఖ్యమైన నాయకులు, స్థానికంగా పలుకుబడి ఉన్న నాయకులు, ఇతర ముఖ్య వ్యక్తులతో సమావేశమవుతారు. రెండో దశలో పార్టీ స్థానిక కమిటీల నాయకులు, కేడర్, మహిళలు (వీర మహిళలు)తో సమావేశం కాగా.. మూడో దశలో ఎన్నికల ప్రచారాన్ని చేపడతారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తన పర్యటన కార్యక్రమం పూర్తయిన వెంటనే, ఆయన రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను సందర్శించనున్నారు, దీనికి అనుగుణంగా పార్టీ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ తరుణంలో బీజేపీ కూడా వారితో పొత్తుకు సిద్దమవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఒక వేళ సీట్ల పంపకాలపై ఇబ్బంది తలెత్తకపోతే ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగివచ్చు. ఇందులో భాగంగా ఇదివరకే పవన్, చంద్రబాబు పలుమార్లు సమావేశమై పొత్తులపై, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించడం తెలిసిందే. కాగా.. బీజేపీ తమతో పొత్తు కూడితే.. తమకు అసలు తిరుగుండదని భావిస్తున్నాయి ఇరు పార్టీలు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీలో పర్యటించారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయి ఏపీలోకి రాజకీయ పరిస్థితులపై చర్చించారు.