విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు నోవాటెల్ హోటల్‌లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటున్నారు.

విశాఖపట్నం నోవాటెల్ హోటల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు నోవాటెల్ హోటల్‌లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటున్నారు. ఆదివారం అక్కడికి చేరుకున్న జనసేన కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి పంపించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం కూడా నోవాటెల్ హోటల్ వద్దకు చేరుకున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. నోవాటెల్ హోటల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ కాసేపట్లో నోవాటెల్ హోటల్‌లోనే జనసేన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యచరణపై చర్చించనున్నారు. అయితే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలవాలని పవన్ కల్యాణ్ ఆలోచన చేస్తున్నట్టుగా జనసేన వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం గవర్నర్ బిశ్వభూషణ్.. బెంగళూరులో ఉన్నారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం తర్వాత విజయవాడకు రానున్నారు. దీంతో పవన్ మధ్యాహ్నం తర్వాత విజయవాడ చేరుకుని.. విశాఖలో చోటుచేసుకున్న పరిణామాలపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అయితే పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అనంతం.. గవర్నర్‌ను కలిసే విషయంలో స్పష్టత రానుంది. 

ఇక, విశాఖ ఎయిర్‌పోర్ట్ వద్ద ఏపీ మంత్రులు, వైసీపీ నాయకులపై దాడి ఘటనలో అరెస్టైన జనసేన నాయకులు, కార్యకర్తలకు న్యాయస్థానంలో ఊరట లభించింది. అరెస్టైన 61 మందిని రూ. పదివేల పూచీకత్తుపై కోర్టు వారిని విడుదల చేసింది. మరో తొమ్మిదిమందికి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. తొమ్మిది మందిపై 307 సెక్షన్ తొలగించి 326 సెక్షన్ గా మార్చి రిమాండ్ విధించారు. అంతకు ముందు హైడ్రామా మధ్య పోలీసులు జనసేన నేతలను ఏడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. 

వారిని కోర్టుకు తీసుకు వచ్చే సమయంలో ప్రాంగణం అన్ని గేట్లు దిగ్బంధం చేశారు మరోవైపు 92 మంది జనసైనికులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు జనసేన లీగల్ సెల్ పేర్కొంది. అరెస్టు చేసిన వారిలో 9 మంది పార్టీ నేతలకు రిమాండ్ విధించారని, 61మంది జనసైనికులకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు జనసేన తెలిపింది.