జగన్ నూ ఉతికి ఆరేసిన పవన్ కల్యాణ్

జగన్ నూ ఉతికి ఆరేసిన పవన్ కల్యాణ్

సాలూరు: తన పోరాట యాత్రలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తూ వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా టార్గెట్ చేశారు. జనసేన పోరాట యాత్రలో భాగంగా ఆయన సాలూరులో జరిగిన సభలో శుక్రవారం ప్రసంగించారు. 

అధికార ప్రతిపక్షాలు కూడబలుక్కుని ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని విమర్శించారు. ప్రతిపక్షం, అధికార పక్షం కూడబలుక్కున్నట్లుగా ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని అన్నారు.  

సచివాయలంలో కూర్చుని మంత్రి నారా లోకేష్ కేంద్రం వేసిన రోడ్లను తాము వేసినట్లుగా చెబుకుంటున్నారని ఆయన విమర్శించారు. రుజువులు చూపించాలని అడుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు లంచాలకు రశీదులిస్తారా అని ప్రశ్నించారు. సాలూరు బైపాస్ రోడ్డు అధ్వాన్నంగా ఉందని అన్నారు. గిరిజన సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని ఆయన అన్నారు. 

జనసేన లేకపోతే అధికార, ప్రతిపక్షాలు ఊళ్లూ ఊళ్లూ పంచుకునేవాళ్లని ఆయన వ్యాఖ్యానించారు. అధికార, ప్రతిపక్షాలను నిలదీయడానికి జనసేన ఉండి తీరాలని ఆయన అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలబడుతామని అన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరించాలని అన్నారు.

ఆ తర్వాత పవన్ కల్యాణ్ గజపతినగరం సభలో ప్రసంగించారు. టీడీపికి మద్దతిచ్చినప్పుడు తనను మంచోడన్నారని, నిలదీస్తుంటే బిజెపి మనిషి అంటున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసమే తాను జనంలోకి వచ్చినట్లు తెలిపారు. ప్రత్యేకహోదా, ప్యాకేజీ పేర్లతో రాష్ట్రానికి అన్యాయం చేశారని, రాష్ట్ర ప్రభుత్వమే 34 సార్లు మాట మార్చిందని అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని అన్నారు. సిపిఎస్ విధానంతో ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page