Asianet News TeluguAsianet News Telugu

రైతులకు పరిహారం: 48 గంటల దీక్షకు దిగిన పవన్ కళ్యాణ్

నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు కనీసం రూ.35 వేలు నష్టపరిహారం చెల్లించాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ రెండు రోజుల దీక్షకు దిగాడు.

Pawan kalyan starts 48 hours protest for farmers compensation lns
Author
Amaravathi, First Published Dec 7, 2020, 7:21 PM IST

హైదరాబాద్: నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు కనీసం రూ.35 వేలు నష్టపరిహారం చెల్లించాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ రెండు రోజుల దీక్షకు దిగాడు.

హైద్రాబాద్‌లోని తన నివాసంలో సోమవారం నుండి 48 గంటల దీక్షకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు.  నివర్ తుఫాన్ తో నష్టపోయిన రైతులను ఆదుకొనేందుకు తక్షణ సాయంగా రూ. 10 వేలు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు అండగా ఉండేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలకు దిగాలని ఆయన కోరారు.

నివర్ తుపాన్ వల్ల దాదాపు 17 లక్షల పైచిలుకు ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. నాలుగు రోజులపాటు నాలుగు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ప్రతి రైతు ఆవేదనతో ఉన్నారని ఆయన గుర్తు చేశారు.  ఇప్పటికే కరోనా వల్ల ఆర్థికంగా చితికిపోయినట్టుగా తెలిపారు. 

ఈ ఏడాది వరుసగా మూడు ప్రకృతి విపత్తులు సంభవించడంతో చేతికొచ్చే దశలో పంటలు నీటిపాలయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరా పంట పెట్టుబడి రూ. 50 వేలు వరకు అవుతుందన్నారు. 

పంట నష్టంతో ఇప్పటి వరకు నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన చెప్పారు. ఎండిపోయిన వరి పనలు తీయడానికి కూడా డబ్బులు లేక నిరాశ, నిస్పృహలతో చనిపోయారు. కుటుంబ సభ్యులు అనాథలుగా  మిగిలిపోయిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మద్యం అమ్మకాల మీద వచ్చే ఆదాయం ప్రభుత్వానికి అవసరం లేదని పదేపదే చెప్పారు.  మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం చేస్తామన్నారు. 

నిషేధం మాట పక్కనపెడితే అమ్మకాలను మాత్రం ప్రోత్సహిస్తున్నారు. సుమారు రూ.16,500 కోట్లు ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది.  మద్యం మీద ఆదాయం అవసరం లేదని చెప్పిన మీరు.. మద్యం ద్వారా వచ్చిన ఆ వేల కోట్ల ఆదాయాన్ని పంట నష్టపోయిన రైతులకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. 
అలా చేస్తే ఎకరాకు రూ. 35 వేలు నష్టపరిహారం ఇవ్వడం ఇబ్బంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 
  
రైతులకు గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర రావాలన్నదే జనసేన ప్రయత్నమన్నారు. ఇందులో భాగంగానే  జైకిసాన్ అనే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామన్నారు. వ్యవసాయ శాస్ర్తవేత్తలు, వ్యవసాయ సంఘాలతో చర్చించి పాలసీని రూపొందిస్తామని ఆయన ప్రకటించారు. దీనిని ఒక ప్రాధాన్య కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్లబోతున్నామని చెప్పారు. 

ఈ దీక్షతో జైకిసాన్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. పంట నష్టపోయిన రైతుకు ప్రభుత్వాలు ఎంతోకొంత నష్టపరిహారం అందిస్తున్నాయన్నారు. కౌలు రైతులను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.

 భూ యజమాని నష్టపోకుండా కౌలు రైతులను ఎలా ఆదుకోవాలన్న దానిపై ప్రభుత్వం లోతుగా ఆలోచించి వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. రైతు కన్నీరు పెడితే రాష్ట్రం సుభిక్షంగా ఉండదు. ప్రతి జనసైనికుడు, నాయకులు అన్నదాతకు మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios