జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌కు ఓ రైతు షాకిచ్చాడు. స్టేజ్‌ మీదే జగన్‌ను గెలిపించాలంటూ పిలుపునివ్వడంతో పవన్‌తో పాటు అక్కడున్న వారంతా ఖంగుతిన్నారు.

కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు సోమవారం కర్నూలులోని ఓ ఫంక్షన్ హాల్‌లో పవన్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం స్థానిక జగన్నాథగట్టులోని పక్కా గృహాలను పరిశీలించారు.

ఎమ్మిగనూర్‌ మీదుగా ఆదోనిలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సమయంలో గిట్టుబాటు ధర లభించడం లేదని, అప్పుల ఊబీలో కూరుకుపోయి కష్టాల్లో ఉన్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై స్పందించిన పవన్ తాను రైతుల పక్షాన పోరాడతానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత దేవనకొండకు చెందిన ఓ రైతు వ్యవసాయంలో కష్టనష్టాలపై మాట్లాడేందుకు వేదిక ఎక్కాడు.

‘‘ ఇప్పుడు వ్యవసాయం కష్టంగా మారింది... గిట్టుబాటు కావడం లేదు.. వానల్లేవు, పశువులే మాకు ప్రపంచం.. వాటినీ అమ్ముకున్నామని... ఇటువంటి పరిస్ధితుల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయలంటూ పిలుపునిచ్చాడు’’.,

అంతే పవన్‌‌ షాక్‌కు గురయ్యాడు...వెంటన తన పక్కనే ఉన్న నాదెండ్ల మనోహర్ చెయ్యి గిల్లి రైతును పక్కకు తీసుకెళ్లారు. అయితే మరో రైతు మాట్లాడుతుండగానే అభిమానులు బారికేడ్లను తొలగించి వేదిక వద్దకు తోసుకొచ్చారు.

వేదికను చుట్టుముట్టి పైకి ఎక్కేందుకు ప్రయత్నించడంతో అక్కడ గందరగోళం నెలకొంది. కుర్చీలతో పాటు కొన్ని వస్తువులు విరిగిపోయాయి. దీంతో పవన్ కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు.