ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా దేవాలయాల్లో దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంపై తాజాగా పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై మండిపడ్డారు.

‘‘మతం భావోద్వేగానికి సంబంధించినది. సున్నితమైనది. మొదటి నుంచి ఆచితూచి స్పందించాం. వరుసగా 142 దాడులు జరిగాయి. వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ్యతగా మాట్లాడాం. కనకదుర్గ గుడిలో వెండి విగ్రహాలు పోయినా... ఎక్కడ దాడి జరిగినా.. అధికారంలో ఉన్నవాళ్లు బాధ్యతను మరిచి మాట్లాడుతున్నారు. పోతే పోయింది అన్నట్టు వ్యవహరిస్తున్నారు. చర్చిలో జరిగితే... మసీదులో జరిగితే ఇదే నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించగలరా? వారి తీరు ఆవేదన కలిగిస్తుంది. 40 ఘటనలపై పలనావాళ్లు చేశారని తేల్చారు.. మిగిలిన వాటిపై మీ సమాధానం ఏంటి? రాష్ట్రమంతా పిచ్చోళ్లు.. అడవి మృగాలు ఉన్నాయా? అప్పుడు కూడా అలాగే సమాధానమిస్తారా?’’ అని పవన్ ప్రశ్నించారు.


దోషులు ఏ పార్టీవారైనా శిక్షించాల్సిందేనని, పార్టీలకతీతంగా దోషులపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ఉదాసీనత వైఖరి విడనాడాలని, బలమైన వ్యవస్థ, అధికార యంత్రాంగం ఉండి కూడా చర్యలు చేపట్టడం లేదని వాపోయారు. ఇలాగే ఉంటే, భవిష్యత్‌లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికైనా అప్రమత్తం కావాలన్నారు. మతం కంటే మానవత్వం గొప్పదని జనసేన భావిస్తుందని, ఆలయాలపై దాడులు దురదృష్టకరమన్నారు.