కాకినాడ: కాకినాడ సీపోర్ట్స్ యజమాని కేవీ రావుపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారం రోజులుగా కాకినాడ సీపోర్ట్ లో అక్రమాలపై గళమెత్తుతున్న పవన్ ఇక ఉపేక్షించరాదని నిర్ణయం తీసుకున్నారు.  

దాదాపు ఐదురోజులుగా కేవీరావు అక్రమాలపై ఆధారాలతో సహా విరుచుకుపడుతున్న అటు సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఇటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కానీ స్పందించకపోవడంతో పవన్ న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు రెడీ అయ్యారు. 

కేవీరావు అవినీతిపై సీఎం చంద్రబాబు, జగన్ ల మౌనంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్ ల మౌనం చూస్తుంటే వారిద్దరికీ అవినీతిలో వాటాలు ఉన్నాయనిపిస్తోందని ఆరోపించారు. చిన్న సినిమా థియేటర్ నడుపుకునే కేవీ రావుకు సీపోర్ట్ ఎలా వచ్చిందో తేలుస్తానన్నారు.

పర్యావరణాన్ని దెబ్బతీస్తూ, మత్స్యకారుల సంపదను కొల్లగొడుతున్న కేవీరావు అమెరికాలో ఉంటారని తెలిపారు. సొమ్ములు ఇక్కడవి అనుభవించేది అమెరికాలో అంటూ మండిపడ్డారు. త్వరలో కేవీరావు అక్రమాలపై అమెరికా ప్రభుత్వానికి, ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేస్తానని పవన్‌ హెచ్చరించారు. కేవీరావుపై ప్రజల పక్షాన పోరాడతానని పవన్ స్పష్టం చేశారు.