‘టిడిపి, వైసిపి ఎంపిలకు చిత్తశుద్ది ఉంటే కేంద్రంపై ఎందుకు అవిశ్వాసతీర్మానం పెట్టడం లేదో తెలియటంలేదు’..ఇవి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు. ఎంపిలు రాజీనామాలకు ఎటువంటి కాలపరమితి పెట్టుకున్నారో తెలీదన్నారు. పైగా రాజీనామాలు చేసినంత మాత్రాన ఎటువంటి ఉపయోగం ఉండదని పవన్ అభిప్రాయపడ్డారు. అదే అవిశ్వాసతీర్మానం ప్రవేశపెడితే పార్టీల్లోని చిత్తశుద్ది బయటపడుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. పవన్ చెప్పిన అవిశ్వాసతీర్మానంపై నెటిజన్లు ఓరేంజిలో ఆటాడుకుంటున్నారు.

పవన్ చెప్పింది బాగానే ఉందికానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. పార్లమెంటులో 545 మంది సభ్యులున్నారు. అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టాలంటే తీర్మానంపై పదిశాతం మంది సభ్యులు సంతకాలు పెట్టాలి. అంటే 54 మంది. ఏపిలో మొత్తం లోక్ సభ స్ధానాల సంఖ్యే 25. అంటే తీర్మానంపై సంతకాలు పెట్టాల్సిన సభ్యుల సంఖ్యలో కసీసం సగం కూడా లేదు.

పైగా 25 మంది సభ్యుల్లో ఇద్దరు బిజెపి ఎంపిలు. అవిశ్వాసతీర్మానానికి వారెటూ సంతకాలు చేయరు. ఆ ఇద్దరినీ మినిహాయిస్తే మిగిలింది 23 మంది మాత్రమే. ఈ 23 మంది ఎంపిలకు మరో 31 మంది ఎంపిలు కలిస్తే కానీ అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టటం సాధ్యంకాదు. టిడిపి, వైసిపిలు సిద్ధపడ్డా వారికి కలసి వచ్చే పార్టీలేవో తెలీదు. ఒకవేళ ఉన్నా 31 మంది ఎంపిల బలమున్న పార్టీలు ఎన్ని కలిస్తే అవిశ్వాస తీర్మానం సాధ్యమవుతుంది? ఈ విషయాలేవీ తెలీకుండానే పవన్ రెండు పార్టీలనూ అవిశ్వాసతీర్మానం గురించి  ఎలా ప్రశ్నిస్తున్నారో అర్దం కావటం లేదు.

ఈ లెక్కలన్నీ బిజెపికి తెలిసే జరిగేపనికాదన్న నమ్మకంతోనే ఏపిని ఏమాత్రం పట్టించుకోవటం లేదు. అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టాలన్న ఆలోచన చంద్రబాబునాయుడుకు కలలోకూడా రాదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే, బడ్జెట్ ప్రవేశపెట్టి 18 రోజులవుతున్నా బడ్జెట్ గురించి మీడియాతో నేరుగా చెప్పలేని వ్యక్తి అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టే ఆలోచన చేస్తారని ఎవరైనా అనుకుంటారా?